WTC Final 2023-25 : దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ నేటినుంచే

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2023-25 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య లండన్ లోని లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ రెండేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సఫారీ జట్టు చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనలు దూసుకొచ్చింది. ఇప్పుడు ఫైనల్లో పటిష్టమైన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది. టెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా టెస్టుల్లో విశేషంగా రాణిస్తోంది. ఇతడి కెప్టెన్సీలో టెస్టుల్లో సఫారీ జట్టు అసలు ఒక్క సారి కూడా ఓడిపోలేదు. డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ రెండేళ్ల సైకిల్లో సఫారీ జట్టు మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచుల్లో ఓడగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఓవరాల్ గా 69.44 విజయ శాతంతో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి తొలిసారి తుది పోరుకు అర్హత సాధించింది. సూపర్ ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా చివరి ఏడు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు తమకు ఎప్పటి నుంచే అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ట్రోఫీని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరుకు ఒక రోజు ముందే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ ఎలెవన్ ను ప్రకటించింది.
విధ్వంసకర బ్యాటర్లు, ప్రమాదకరమైన బౌలర్లతో సఫారీల తుది జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈసారి డిఫెండింగ్ చాంప్ ఆసీసు చుక్కలు కనిపించడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా కూడా వరుసగా రెండో ట్రోఫీ కైవపం చేసుకోవాలని ఆతృతగా ఉంది. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆసీస్‌కు కూడా అద్భుతంగా రాణించింది. 19 మ్యాచుల్లో 13 విజయాలు సాధించింది. 67.54 విజయ శాతంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ఫైనలకు అర్హత సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com