రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ క్వింటన్ డికాక్

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డి కాక్ వన్డే క్రికెట్ నుంచి తాను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పాకిస్థాన్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ప్రకటించిన దక్షిణాఫ్రికా జట్లలో ఆయన పేరును చేర్చారు.దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్‌తో జరిగిన చర్చల తర్వాత డి కాక్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశం తరఫున ఆడాలన్న అతని కోరిక ఇంకా బలంగా ఉందని కాన్రాడ్ తెలిపారు. డి కాక్ తన పునరాగమనాన్ని 2026 టీ20 ప్రపంచ కప్, అలాగే 2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత డి కాక్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ టోర్నీలో అతను 594 పరుగులు చేసి అత్యధిక రన్స్ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. డి కాక్ 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు, అతను వన్డేల్లోకి తిరిగి రావడం జట్టుకు ఒక పెద్ద బూస్ట్ అని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా తరఫున 155 వన్డేలు ఆడిన డికాక్, 45.74 సగటుతో 6,770 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా, 92 టీ20 మ్యాచ్‌లలో 138కి పైగా స్ట్రైక్ రేట్‌తో 2,584 పరుగులు చేశాడు. అతని అనుభవం, దూకుడైన బ్యాటింగ్ రాబోయే టోర్నమెంట్లలో జట్టుకు కీలకం కానున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com