ASIA CUP: ఒమన్.. వణికించెన్

ఆసియాకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు పసికూన ఒమన్ ముచ్చెమటలు పట్టించింది. సులువైన ప్రత్యర్థినే కదా అని అలవోకగా తీసుకున్న టీమ్ఇండియా..ఒమన్‌పై చెమటోడ్చి నెగ్గింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. కేవలం 21 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచి భారత్ ఊపిరి పీల్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ ఖలీమ్, మిర్జా హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
రాణించిన సంజు, అభిషేక్
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఒమన్ లాంటి చిన్న జట్టు మీద రికార్డులు బద్దలయ్యే స్కోరు చేస్తుందనుకుంటే, స్లో పిచ్‌పై కొంత తడబడి ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. ఆరంభంలో 2 ఓవర్లకు వికెట్ నష్టపోయిన భారత జట్టు కేవలం 6 పరుగులే చేసింది. ఫైజల్ షా ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే శుభ్‌మన్ (5) బౌల్డ్ చేసి బారత్‌కు పెద్ద షాక్ ఇచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో చెలరేగడంతో మూడో ఓవర్ నుంచి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. టోర్నీలో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ మరో ఎండ్‌లో ఆచితూచి ఆడుతుంటే.. అభిషేక్ పదే పదే బంతిని బౌండరీకి పంపించాడు. కుదురుకున్నాక సంజు కూడా బ్యాటు ఝళిపించడంతో 7 ఓవర్లకు 72/1తో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. కానీ తర్వాతి ఓవర్లో టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. జోరుమీదున్న అభిషేక్‌ను రామనంది ఔట్ చేయగా.. హార్దిక్ (1) రనౌటైపోయాడు. తిలక్ (29; 18 బంతుల్లో 1×4, 2×6) మెరుపులతో భారత్ 188 పరుగుల మెరుగైన స్కోరు చేయగలిగింది.
పోరాడిన ఒమన్
టీమ్డియా నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకుంది. నిర్జీవమైన పిచ్‌పై పసలేని టీమ్ఇండియా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ ఒమన్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. . ఆమీర్ కలీమ్(46 బంతుల్లో 64, 7ఫోర్లు, 2సిక్స్‌లు), హమ్మద్ మీర్జా(33 బంతుల్లో 51, 5ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. వీరిద్ధరి ధాటికి ఒక దశలో ఒమన్..భారత్‌కు షాక్ ఇస్తుందా అనిపించింది. హార్దిక్, అర్ష్‌దీప్, రానా, కుల్దీప్ ఒక్కో వికెట్ తీశారు. గత మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న జతిందర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో కలీమ్ కూడా జత కలువడంతో ఒమన్ పవర్‌ప్లే ముగిసే సరికి 44 పరుగులు చేసింది. 9 వికెట్లు చేతిలో ఉండగా ఒమన్ 16 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి రావడంతో సంచలనం నమోదవుతుందా అనిపించింది. కానీ హర్షిత్ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌లో హార్దిక్ పాండ్య పరుగెత్తుతూ పట్టిన చక్కటి క్యాచ్‌కు కలీమ్ ఔటైపోవడంతో ఒమన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. తర్వాత సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడం, ఇంకో 2 వికెట్లు పడడంతో ఒమన్‌కు అవకాశం లేకుండా పోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

