T20 WORLDCUP: చితక్కొట్టారు.. కప్పును ఒడిసిపట్టారు

టీ20 క్రికెట్లో మరోసారి టీమ్ఇండియా తన సత్తా చాటింది. అద్భుతమైన బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పూర్తిగా అదుపులో పెట్టి ప్రపంచకప్‌ను ఘనంగా కైవసం చేసుకుంది. ప్రారంభం నుంచే దూకుడైన ఆటతీరుతో మ్యాచ్‌పై పట్టు సాధించిన భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కీలక సమయంలో ఆటగాళ్లు చూపిన ధైర్యం, సమన్వయం, దూకుడు టీమ్ఇండియాను జగజ్జేతగా నిలిపాయి. అభిమానుల ఆశలను నెరవేర్చుతూ ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని నిరూపించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్ ఫైనల్లో ఏ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. సంజు శాంసన్ (89; 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అతనికి తోడుగా అభిషేక్ శర్మ (52; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకాలతో మెరిశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు అభిషేక్, సంజు శాంసన్‌లు అద్భుత ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. హెన్రీ బౌలింగ్‌లో సంజు భారీ సిక్స్‌తో ఖాతా తెరిచాడు. మరోవైపు డఫీ ఓవర్లో అభిషేక్ వరుసగా ఫోర్లు బాదారు. స్కోరు వేగంగా పెరిగింది. ఇద్దరూ కళ్లు చెదిరే షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించారు. కేవలం 18 బంతుల్లోనే అభిషేక్ అర్ధశతకం పూర్తి చేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టం లేకుండా 92 పరుగులు సాధించింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలో కొంత ధాటిగా ఆడినా ఎక్కువసేపు నిలవలేకపోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. మూడో ఓవర్లోనే ప్రమాదకర అలెన్ (9)ను అక్షర్ పటేల్ ఔట్ చేసి కివీస్ పతనానికి నాంది పలికాడు. వెంటనే రచిన్‌ను జస్ప్రీత్ బుమ్రా వెనక్కి పంపాడు. తర్వాత ఫిలిప్స్ (5)ను అక్షర్, చాప్మన్ (3)ను హార్దిక్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. మరోవైపు సీఫర్ట్ (52; 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కొంత ప్రతిఘటన చూపినా వరుణ్ అతడిని ఔట్ చేశాడు. అప్పటికి కివీస్ స్కోరు 72/5కు పడిపోయింది. అప్పటికే అవసరమైన రన్‌రేట్ దాదాపు 16కు చేరుకోవడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గుచూపింది. ఆరో వికెట్‌కు శాంట్నర్ (43; 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరియు మిచెల్ (17) 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా మ్యాచ్‌ను మలుపు తిప్పలేకపోయారు. మిచెల్‌ను అక్షర్ ఔట్ చేయడంతో ఆ భాగస్వామ్యం ముగిసింది. అనంతరం బుమ్రా తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ వరుస వికెట్లు తీసాడు. ఒకే ఓవర్లో నీషమ్, హెన్రీలను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో శాంట్నర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరికి డఫీని అభిషేక్ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
