CRICKET: హర్మన్ సేనకు అగ్ని పరీక్ష

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా మహిళలతో నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా గ్రూప్- ఏ నుంచి సెమీస్ చేరుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడటం హర్మన్‌ప్రీత్ సేనకు చేటు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన టీమ్‌ఇండియా.. గత మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేసి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఆస్ట్రేలియాను మట్టికరిపించాలని చూస్తోంది. అందుకు భారత్ పూర్తిస్థాయిలో సత్తాచాటాల్సిందే. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడింది. ఈ సారి ఆ రికార్డును సవరించాల్సిన అవసరం ఉంది.
భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ A నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖారారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, కివీస్, పాక్‌లు పోటీ పడుతున్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే నేడు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది.. లేదంటే కివీస్ ఆడే 2 మ్యాచుల్లో ఓడాలి. ఒకదాంట్లోనైనా కివీస్ చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌రేట్‌తో భారత్ సెమీస్ చేరుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com