TEAM INDIA: అడుగులు అన్నీ వన్డే ప్రపంచకప్ వైపే

భారత క్రికెట్ మరోసారి ప్రపంచ వేదికపై తన శక్తిని చాటింది. టీ20 ఫార్మాట్లో వరుస విజయాలతో అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత రెండో టైటిల్ కోసం భారత్‌కు దాదాపు 17 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఆ నిరీక్షణ ముగిసి 2024లో ట్రోఫీని సొంతం చేసుకున్న భారత జట్టు, ఆ విజయోత్సాహం తగ్గకముందే మరో గొప్ప విజయాన్ని అందుకుంది. కేవలం 20 నెలల వ్యవధిలో మరో టీ20 ప్రపంచకప్‌ను గెలిచి పరిమిత ఓవర్ల క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఈ విజయంతో భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాబోయే వన్డే ప్రపంచకప్‌పై నిలిచింది. 2027లో జరగనున్న ఆ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్ ప్రభావం పెరగడంతో వన్డే మ్యాచ్‌లకు ఆదరణ కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా వన్డే మ్యాచ్‌ల సంఖ్య కూడా తగ్గిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీగా ఇప్పటికీ వన్డే ప్రపంచకప్‌కే ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్లకు ఒకసారి జరిగే టీ20 ప్రపంచకప్‌తో పోలిస్తే నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఆటగాళ్లు, అభిమానులు రెండువర్గాలూ మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఆ టోర్నీలో విజేతగా నిలవడం ప్రతి జట్టు కల. భారత జట్టు ఇప్పటివరకు రెండు సార్లు ఈ ఘనతను అందుకుంది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని జట్టు తొలి ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. అనంతరం 2011లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత్ మరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన మూడు వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌కు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా 2023లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఫైనల్లో ఓటమితో టైటిల్ చేజారింది.
ఇప్పుడు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 వన్డే ప్రపంచకప్‌పై టీమ్ ఇండియా ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్టు అదే జోష్‌తో వన్డే ప్రపంచకప్‌ను కూడా గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆ లక్ష్యం సాధించాలంటే ముందుగానే సరైన వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ విజయానికి కోచ్ గౌతమ్ గంభీర్ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రూపొందించిన ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. టోర్నీకి చాలా ముందుగానే జట్టుపై ఒక స్పష్టమైన అంచనాకు వచ్చి, యువ ఆటగాళ్లకు విస్తృతంగా అవకాశాలు కల్పించారు. ఆ నిర్ణయం ఫలితంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు జట్టులో కీలక సభ్యులుగా ఎదిగారు. ఇటీవల జరిగిన మూడు వన్డే సిరీస్‌లలో రోహిత్, కోహ్లి ఇద్దరూ అద్భుతంగా రాణించారు. ఫిట్నెస్ పరంగానూ ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ గతంతో పోలిస్తే బరువు తగ్గి మరింత ఫిట్‌గా మారినట్లు కనిపిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్లో ఈ ఇద్దరూ మంచి ప్రదర్శన చేస్తే 2027 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతం అవుతుంది. వీరిద్దరూ ఫిట్నెస్ను కొనసాగించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
