TEAM INDIA: పడిపోతున్న టీమిండియా ప్రమాణాలు

ఒకప్పుడు భారత గడ్డపై అడుగుపెట్టాలంటేనే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. సిరీస్ ఫార్మాట్ ఏదైనా సరే… ఫలితం మాత్రం భారత జట్టు అనుకూలంగానే ఉండేది. స్వదేశంలో ఓటమి అన్నది అరుదైన విషయం. కానీ కాలం మారుతోంది. పరిస్థితులు మారుతున్నాయి. భారత క్రికెట్ ఆధిపత్యానికి పునాది అయిన సొంతగడ్డపైనే ఇప్పుడు టీమ్ ఇండియా తడబడుతోంది. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్… భారత జట్టు పడిపోతున్న ప్రమాణాలకు మరో బలమైన నిదర్శనంగా నిలిచింది. ఇప్పటికే 2024లో భారత్‌లో తొలిసారిగా టెస్టు సిరీస్‌ను (అది కూడా 3-0తో) కైవసం చేసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు… ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్‌నూ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు నాలుగు ఐసీసీ టోర్నీలు సహా వన్డే క్రికెట్ ఆడేందుకు 16 సార్లు భారత్‌కు వచ్చిన కివీస్… ఒక్క సిరీస్‌నూ గెలవలేకపోయాయి. అలాంటి జట్టుకు తొలిసారి వన్డే సిరీస్‌ను చేతులారా అప్పగించిన ఘనత మాత్రం భారత జట్టుదే కావడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ పరాభవానికి ప్రధాన బాధ్యత ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వ్యూహపరమైన తప్పిదాలు, జట్టు ఎంపికలో లోపాలు, మ్యాచ్ సమయంలో తీసుకున్న నిర్ణయాలు భారత ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు తొలిసారిగా భారత పర్యటనకు వచ్చారు. అనుభవ లోపం వారిని వెనక్కి లాగుతుందని అందరూ భావించారు.
తేలిపోయిన భారత వ్యూహాలు
క్రమశిక్షణతో కూడిన ఆటతీరు, స్పష్టమైన ప్రణాళికలతో కివీస్ భారత జట్టును మట్టికరిపించింది. మరోవైపు భారత జట్టు మాత్రం గందరగోళ వ్యూహాలు, స్థిరత్వం లేని ఆటతో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్‌లో భారత జట్టు తీవ్ర అస్థిరత్వాన్ని చూపించింది. స్టార్ బ్యాటర్లపై భారం పడినప్పటికీ… ఆ ఒత్తిడిని తట్టుకునే స్థాయిలో మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ మినహా మిగిలిన బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగుల రేటును పెంచడంలో విఫలం కావడం భారత్‌కు తీవ్రంగా నష్టం కలిగించింది. స్పిన్నర్లను ఎదుర్కొనే విషయంలోనూ భారత బ్యాటింగ్ లైనప్ తడబడింది. బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న పరిస్థితి నెలకొంది. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీని వల్ల కివీస్ ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించగలిగారు. ఈ సిరీస్‌లో భారత బౌలర్లు ఓవర్‌కు సగటున 6.2 పరుగులు ఇచ్చారు. గత పదేళ్లలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
స్పిన్ బౌలింగ్ భారత్‌కు ఎప్పటికీ ప్రధాన ఆయుధం. కానీ ఈ సిరీస్‌లో అదే విభాగం భారత జట్టును ముంచింది. ప్రత్యర్థిని స్పిన్‌తో కట్టడి చేయలేకపోవడం ఒక వైపు… అదే సమయంలో కివీస్ స్పిన్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడటం మరోవైపు జట్టును దెబ్బతీసింది. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్ మొత్తం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
