TEAM INDIA: సంక్షోభంలో భారత క్రికెట్...!

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు వన్డే క్రికెట్ మాత్రమే ఆడతారు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజ పేర్లు - రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆధునిక క్రికెట్లో టీమిండియాకు రెండు కళ్లుగా మారిన ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి వీడ్కోలు పలికారు. టి20, టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది. ఈ ఇద్దరూ కలిసి టి20, టెస్టుల్లో ఏకంగా 21,950 పరుగులు చేశారు.
గిల్ నడిపించగలడా..?
రో-కో సుదీర్ఘ ఫార్మట్ నుంచి వైదొలగడంతో ఇప్పుడు టీమిండియా టెస్టు క్రికెట్ సంక్షోభంలో చిక్కుకుంటున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా సందిగ్ధంలో పడింది. భారత టెస్ట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా గిల్‌ను వైస్ కెప్టెన్‌గా పంత్‌ను నియమించారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్ట్ కెప్టెన్సీకి పోటీదారుడిగా ఉన్నా బీసీసీఐ గిల్‌వైపే మొగ్గు చూపింది. రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ముగ్గురు కీలక ఆటగాళ్లు లేని లోటును టీమిండియా మేనేజ్మెంట్ భర్తీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. రోహిత్ శర్మ వదిలి వెళ్లిన ఓపెనింగ్ స్లాట్, విరాట్ కోహ్లీ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానం, రవిచంద్రన్ అశ్విన్ లేని ప్రధాన స్పిన్నర్ స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. భారత టెస్ట్ జట్టుకు దూకుడుగా ఉండే కెప్టెన్ అవసరమని, ఆ పాత్రకు రిషబ్ పంత్ సరిగ్గా సరిపోతాడని కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రతీక్ కుమార్ అన్నారు.
యువతరం ముందుకు తీసుకెళ్లగలదా..? *
టీమిండియా ప్రమాదంలో పడనుందని మాత్రం మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా అనేదానిపై చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు నంబర్ వన్ పొజిషన్లో కొనసాగింది. హిట్ మ్యాన్ కూడా అంచనాలను అందుకున్నాడు. అయితే రాబోయే యువ కెప్టెన్ ఆ వారసత్వాన్ని కొనసాగించగలడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com