TEST: తొలి టెస్ట్‌ ఓటమి.. కారణాలు ఇవే..

TEST: తొలి టెస్ట్‌ ఓటమి.. కారణాలు ఇవే..
X
రెండు ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయిన లోయర్‌‌ ఆర్డర్... బౌలింగ్‌తోనూ నిరాశపరిచిన భారత్

ఒకే టెస్టులో అయిదు సెంచరీలు.. దాదాపు 800 పరుగులు.. టాలెంటెడ్‌ బౌలర్లు.. ఇంకేముంది తొలి టెస్టు విజయం భారత్‌ ఖాతాలోకే అని అందరూ అనుకున్నారు. కట్‌ చేస్తే.. 5 వికెట్ల తేడాతో ఓడి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తొలి టెస్ట్‌ ఓటమి ప్రభావం సిరీస్‌లోని తర్వాతి టెస్ట్‌ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉంది. గెలుపోటముల సంగతి అటుంచితే.. పటిష్ట జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఇంగ్లండ్ పర్యటనను ఇండియా టీమిండియా ఓటమితో స్టార్ట్ చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అనూహ్య ఓటమిని చవిచూసింది. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు నెలకొల్పిన రికార్డు భాగస్వామ్యం మ్యాచ్‌ విజయాన్ని శాసించింది.

41 పరుగులకే 7 వికెట్లు

టాప్‌ ఆర్డర్‌‌ బ్యాటర్లు శతకాలతో చెలరేగి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి అయిదుగురు భారత బ్యాటర్లు సెంచరీలు చేశారు. అయితే, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. 430/3 స్కోర్‌‌తో పటిష్టంగా ఉన్న టీమిండియా కేవలం 41 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ లోయర్ ఆర్డర్‌‌ వైఫల్యం భారత్‌కు శాపంగా మారింది. 333 పరుగుల వరకు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్‌ ఉంచేట్టుగా కనిపించిన భారత్.. చివరి 6 వికెట్లకు కేవలం 31 రన్స్ మాత్రమే జోడించి 364 పరుగులకు ఆలౌటైంది.

క్యాచ్‌లే కీలకంగా..

తొలి టెస్ట్ ఫలితంపై భారత్‌ ఫీల్డింగ్‌ తీవ్ర ప్రభావం చూపించింది. రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి దాదాపుగా 10 క్యాచ్‌లను ఇండియన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిసి నాలుగు కీలక క్యాచ్‌లను వదిలేశాడు యశస్వీ జైస్వాల్‌. 97 పరుగుల వద్ద బెన్‌ డకెట్‌ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్‌ జారవిడిచాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న డకెట్‌.. 149 పరుగులతో రాణించి ఇంగ్లండ్‌కు విజయ తీరాలకు చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా డకెట్‌కు భారత్‌ అనూహ్య అవకాశాలను ఇచ్చింది. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు క్యాచ్‌లను వదిలేశారు.

బుమ్రా మినహా..

బుమ్రా మినహా ఇతర బౌలర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేదు. అతని బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన బ్రిటీష్ బ్యాటర్లు మిగిలిన బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ వికెట్లు పడగొట్టలేదు సరికదా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. జడేజా స్పిన్‌ కూడా ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయింది. పేస్ బౌలర్ల అనుభవలేమి స్పష్టంగా కనిపించింది.పేస్ ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ రెండు విభాగాల్లోనూ నిరాశపరిచాడు.

భాగస్వామ్యమే శాసించింది

ఇంగ్లండ్ అసాధారణ బ్యాటింగ్ టీమిండియా ఓటమిని శాసించింది. 371 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (149), జాక్ క్లాలీ (65) తొలి వికెట్‌కు 188 పరుగుల పార్ట్‌నర్‌‌షిప్‌ కీలకమైంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం మిగతా బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడేందుకు ఉపయోగపడింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ సునాయస విజయం సాధించింది.

Tags

Next Story