TEAM INDIA: రో-కో మొదలెట్టేశారు

కెరీర్లోనే అత్యంత కీలక సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపిన రో-కో ప్రాక్టీస్ ఆరంభించారు. ఈ సిరీస్ లో సత్తా చాటి 2027 వరల్డ్ కప్ దిశగా తొలి అడుగు వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దాదాపు 30 నిమిషాలు నెట్స్‌లో గడిపారు. టీమిండియా అతిపెద్ద సమరానికి మరో రెండు రోజులే మిగిలుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో ఆడాలంటే పోటీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ - కోహ్లికి కూడా ఇది రీ ఎంట్రీ లాంటి మ్యాచ్చే అని చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ ఇద్దరూ బ్లూ జెర్సీలో కనిపించడం కూడా ఇదే మొదటిసారి. దాంతో ఈ సిరీస్‌లో తమ సత్తా చాటాలని ఫిక్స్ అయిన ఈ లెజెండ్స్ పెర్త్‌లో ఫుల్ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు.
చెమటోడోచ్చిన రోకో
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమ్ఇండియా సాధన మొదలెట్టింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నారు. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఈ ఇద్దరు స్టార్లు వన్డే క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టగానే వాళ్లు సమయం వృథా చేయకుండా నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రధాన కోచ్ గంభీర్‌తో రోహిత్ మాట్లాడడం కనిపించింది. ప్రాక్టీస్ ముగిసిన అనంతరం కోహ్లి.. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో మాట్లాడాడు. భారత జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్లు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం పెర్త్‌లో జరుగుతుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జంటగా బరిలోకి దిగారు. ఇద్దరూ పక్కపక్కనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దికాలం విరామం తర్వాత బ్లూ జెర్సీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్న ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు, నెట్లో సుదీర్ఘంగా శ్రమించి బంతిపై పట్టును తిరిగి పొందే ప్రయత్నం చేశారు. ఇద్దరు నెట్స్ లో చాలా సులభంగా బంతులను ఎదుర్కొన్నారు.
ఇద్దరికీ కీలకమే
రోహిత్, కోహ్లి ఇద్దరికీ కూడా కీలకమైంది. వన్డే భవిష్యత్తు దృష్ట్యా 2027లో దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇది అత్యంత ప్రాధాన్యమైన సిరీస్‌గా పరిగణిస్తున్నారు. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చే దిశగా టీమిండియా మేనేజ్మెంట్ అడుగులు వేస్తున్న సమయంలో.. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనే భవిష్యత్తు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించగా, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ పర్యటనలో తొలిసారిగా వన్డే కెప్టెన్‌గా నాయకత్వం వహించబోతున్నాడు. ఇంగ్లండ్ టెస్ట్ పర్యటనలో అద్భుత ప్రదర్శనతో తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని చాటుకున్న గిల్, ఇప్పుడు వైట్‌బాల్ ఫార్మాట్లో తన నాయకత్వాన్ని పరీక్షించుకోనున్నాడు.
సుదీర్ఘ కెరీర్
టీమిండియా ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే సిరీస్ అక్టోబర్ 19న పెర్త్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. అనంతరం అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్, అక్టోబర్ 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మిగతా రెండు వన్డేలు జరుగనున్నాయి. తదుపరి టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ కూడా భారత జట్టుకు కీలకం, ఎందుకంటే 2026 టీ20 వరల్డ్‌కప్‌కు ఇది ప్రిపరేషన్ సిరీస్‌గా భావిస్తున్నారు. రోహిత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే,అతను ఒక అరుదైన చరిత్రను సృష్టించబోతున్నాడు. అక్టోబర్ 19న పెర్త్‌లో జరగబోయే ఈ తొలి వన్డేలో రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే,అది అతని 500వ అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com