TEAM INDIA: హీరోల్లా నిలిచారు.. ప్రపంచాన్నే గెలిచారు

ప్రపంచకప్ గెలవాలంటే సాధారణంగా ఒక జట్టులో భీకరమైన ఆటగాళ్లు ఉండాలి, ప్రత్యర్థి జట్లను భయపెట్టే స్థాయి ప్రదర్శన చేయాలి, ప్రతి మ్యాచ్‌లో సమష్టిగా రాణించాలి అనే అభిప్రాయం ఉంటుంది. టోర్నీ మొత్తం ఒకే విధమైన ఆధిపత్యం చూపిన జట్టే చివరకు ట్రోఫీని అందుకుంటుందని అనుకుంటారు. కానీ ఈసారి కథ పూర్తిగా భిన్నంగా సాగింది. కొన్నిసార్లు తడబడుతూ, కొన్నిసార్లు ఒత్తిడిని ఎదుర్కొంటూ, ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలుస్తూ ముందుకు సాగిన టీమిండియా చివరకు టీ20 ప్రపంచకప్ 2026ను కైవసం చేసుకుంది. ప్రదర్శన పరంగా ఇది ‘పర్ఫెక్ట్’ టోర్నీ కాకపోయినా, పోరాటస్ఫూర్తితో సాధించిన ఈ విజయం మాత్రం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
సూర్య నేతృత్వం
సొంతగడ్డపై టోర్నీ జరగడం వల్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుపై కొంత ఆశలు ఉండేవి. అయితే కచ్చితంగా కప్పు గెలుస్తుందనేంత నమ్మకం మాత్రం అభిమానుల్లో కనిపించలేదు. టోర్నీ ప్రారంభ దశలో భారత్ ప్రత్యర్థి జట్లపై భీకరమైన ఆధిపత్యం చూపించలేదు. కొన్ని మ్యాచ్‌ల్లో జట్టు ఆట తడబడింది. అంచనాలు పెట్టుకున్న కొందరు ఆటగాళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ఒక దశలో భారత్ సెమీఫైనల్ చేరుతుందా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఈ పరిస్థితి అభిమానులకు 2023 వన్డే ప్రపంచకప్‌ను గుర్తు చేసింది. ఆ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడుతూ ప్రతి ప్రత్యర్థిని ఓడించి అజేయంగా ఫైనల్ చేరింది. అప్పటికి రోహిత్ శర్మ సేన ఆధిపత్యం చూసి కప్పు దాదాపు భారత్‌కే ఖాయమని అనిపించింది. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా సంచలన విజయంతో ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆ బాధ ఇంకా అభిమానుల మనసుల్లో ఉండగానే ఈసారి టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరిగింది. యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఐపీఎల్ వంటి టోర్నీల అనుభవం వల్ల అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి యువ క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగారు. ఫైనల్‌కు ముందు వరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ శర్మ తుదిపోరులో అర్ధశతకం సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇచ్చాడు. అభిషేక్ విఫలమైన మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బాధ్యత తీసుకుని జట్టుకు కీలక పరుగులు అందించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.
సంజు శాంసన్ కూడా ఈ టోర్నీలో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత్ ఒత్తిడిలో పడగా, అతను అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను చేసిన 97 నాటౌట్ జట్టు ప్రయాణాన్ని మలుపుతిప్పిన ఇన్నింగ్స్‌గా నిలిచింది. తర్వాత సెమీఫైనల్, ఫైనల్లో కూడా సంజు తన బ్యాటింగ్‌తో ప్రభావం చూపించాడు. తిలక్ వర్మ లీగ్ దశలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా సూపర్–8 దశ నుంచి తన ప్రతిభను చూపించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
