TEAM INDIA: స్పాన్సర్స్ లేకుండానే బరిలోకి టీమిండియా

ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భారీ నష్టం వాటిల్లనుంది. టీమిండియాకు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11.. కొత్తగా తెచ్చిన గేమింగ్ నియంత్రణ బిల్లు ద్వారా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జెర్సీ స్పాన్సర్ లేకుండా ఆసియా కప్ 2025లో టీమిండియా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల 9న యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఆలోపు కొత్త స్పాన్సర్ దొరక్కపోతే మెయిన్ స్పాన్సర్ లేకుండానే భారత జట్టు టోర్నీలో పాల్గొననుంది.
బిల్లుకు ఆమోదం
ఇక నగదుతో కూడిన ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండానే ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత.. రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు' ఆమోదం పొందింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్ మనీ గేమ్‌లను ఆడితే గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారత క్రీడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో జరుగుతున్న క్రీడా టోర్నీలకు గేమింగ్ యాప్స్ సంస్థలే స్పాన్సర్ చేస్తున్నాయి. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడా టోర్నీలకు కూడా కోట్ల రూపాయాలను వెచ్చిస్తున్నాయి. కానీ.. తాజా బిల్లు కారణంగా ఆ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఏటా ₹5,000 కోట్ల వరకు ప్రకటనల కోసం ఖర్చు చేస్తాయి. వీటిలో ఎక్కువ భాగం క్రికెట్‌కు సంబంధించిన టోర్నమెంట్లకే వెళ్తుంది.
జెర్సీ స్పాన్సర్ దొరికేనా!
డ్రీమ్11 ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు అధికారిక జెర్సీ స్పాన్సర్‌గా ఉంది. ఈ సంస్థ బీసీసీఐతో 2023 నుంచి 2026 వరకు ₹358 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి సగటున డ్రీమ్ 11 బీసీసీఐకి సుమారు ₹119.33 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో స్వదేశం జరిగే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ. 3 కోట్లు, విదేశాల్లో జరిగే ప్రతీ మ్యాచ్‌కు రూ. కోటి చెల్లిస్తుంది. తాజా బిల్లుతో డ్రీమ్ 11 తప్పుకోవడం లేదా బీసీసీఐ నిషేధం విధించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. కొత్త స్పాన్సర్ దొరక్కపోతే బీసీసీఐకి కోట్ల రూపాయాల్లో నష్టం వాటిల్లనుంది. అయితే బీసీసీఐకి స్పాన్సర్ చేసేందుకు చాలా కంపెనీలు క్యూ కడుతాయి. డ్రీమ్ 11 అంత భారీ ధర చెల్లించకపోయినా కాస్త తక్కువైనా బీసీసీఐకి జెర్సీ స్పాన్సర్ లభించే అవకాశం ఉంది.
మహిళలు జట్టుకు కూడా..
ఒక వేళ బీసీసీఐ చట్టాన్ని ఉల్లంఘిస్తే, బిల్లులో జరిమానా విధించే రూల్ కూడా ఉంది. డ్రీమ్11 ప్రస్తుతం ఇండియా మెన్స్, ఉమెన్స్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 2023లో బీసీసీఐతో రూ. 358 కోట్ల రూపాయల ఒప్పందంతో BYJU నుండి స్పాన్సర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఒకవేళ చట్టంగా మారితే మాత్రం భారత జట్టు ఎలాంటి స్పాన్సర్ షిప్ లేకుండా వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ లో ఆడనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com