IND VS ENG: నేడే నామమాత్రపు టీ 20

భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు ఐదో టీ20 జరగనుంది. ఇప్పటికే 3-1తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని భావిస్తోంది. అటు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగాలనుకుంటోంది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో భారత జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత బౌలర్లు విశేషంగా రాణిస్తున్నా.. బ్యాటింగ్ విభాగం మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్, ఓపెనర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నారు. సొంతగడ్డపై భారత కెప్టెన్‌గా సూర్యకిది తొలి మ్యాచ్. గత ఏడు ఇన్నింగ్స్‌లో ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేని సూర్య భాయ్.. ఈ సిరీస్‌లో చేసింది 26 పరుగులే. కానీ వాంఖడే గ్రౌండ్‌లో ఆడిన టీ20ల్లో సూర్య 1493 పరుగులు సాధించడం విశేషం. అదే జోరును ఈ మ్యాచ్‌లో పునరావృతం చేసి ఫామ్‌ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శాంసన్.. పేసర్లు ఉడ్, ఆర్చర్ బంతులను ఆడలేకపోతున్నాడు. షార్ట్‌పిచ్ బంతులకు అవుటవడం పరిపాటిగా మారిం ది. అతడికి ఈ మ్యాచ్ చక్కటి అవకాశం. బౌలింగ్‌లో షమిని తుదిజట్టులోకి తీసుకునే చాన్సుంది.
శాంసన్ కొంపముంచుతున్న ఫుల్ షాట్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ వైఫల్యం కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన T20 మ్యాచ్‌ల్లో ఈ కేరళ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 26 పరుగులతో పర్వాలేదనిపించినా.. తర్వాతి 3 మ్యాచ్‌ల్లో వరుసగా 5,3,1 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ 4 మ్యాచ్‌ల్లో శాంసన్ ఫుల్ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. ఇలా వరుసగా ఔటై వెనుదిరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఎలా ఆడాలో మా కుర్రాళ్లకు తెలుసు: సూర్య
ఇంగ్లండ్‌తో జరిగిన 4వ T20లో భారత్ ఒడిదుడుకులను అధిగమించి గెలిచింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘జట్టులో ప్రతి ఒక్కరూ అత్యుత్తమంగా ప్రదర్శన చేశారు. 10 పరుగులకే 3 వికెట్లు పడడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్‌పై పట్టు కోల్పోకూడదని నిర్ణయించుకున్నాం. మేము ఎలాంటి బ్రాండ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నామో మా ప్లేయర్లకు తెలుసు. అందుకు తగ్గట్లే వారి ప్రదర్శన ఉంది. అని ఆయన చెప్పుకొచ్చారు.
నా అభిమానులే నా ఆస్తి: హార్దిక్ పాండ్యా
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో సమయంలో మీడియాతో హార్దిక్ పాండ్యా చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 'బ్యాటింగ్ ఎల్లప్పుడూ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నేను దానిని చాలా ప్రేమిస్తున్నాను. ఇంగ్లండ్‌పై బాగా బ్యాటింగ్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. నా అభిమానులే నా ఆస్తి. క్రికెట్ పట్ల నిజాయితీగా, విధేయుడిగా ఉండాలనుకుంటున్నాను.' అని హార్దిక్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com