TEAM INDIA: భారత బౌలింగ్ దళానికి ఏమైంది..?

ఒకప్పుడు భారత క్రికెట్ అంటే ప్రత్యర్థులకు భయమే. ముఖ్యంగా సొంతగడ్డపై అయితే భారత బౌలింగ్ దళం అంటే పరుగులు తీయడం అసాధ్యమని భావించేవారు. పవర్‌ప్లేలో వికెట్లు, మిడిల్ ఓవర్లలో స్పిన్ ఉచ్చు, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన సీమ్ బౌలింగ్… ఇదే టీమ్ఇండియా గుర్తింపు. కానీ ఇప్పుడు ఆ బలం క్రమంగా మాయమవుతోంది. న్యూజిలాండ్‌తో ముగిసిన తాజా వన్డే సిరీస్, భారత బౌలింగ్ దళం ఎంతగా బలహీనపడిందో కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ కాదు… స్పష్టంగా చెప్పాలంటే బౌలింగ్ వైఫల్యమే. బ్యాటర్లు కొన్ని సందర్భాల్లో భారీ స్కోర్లు సాధించినా, వాటిని కాపాడుకునే సామర్థ్యం బౌలర్లలో కనిపించలేదు. పవర్‌ప్లేలో వికెట్లు తీయలేకపోవడం, మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోవడం, చివర్లో పరుగుల వరదను ఆపలేకపోవడం… ఇలా అన్ని విభాగాల్లో భారత బౌలింగ్ దళం విఫలమైంది.
ధారళంగా పరుగులు
ఈ సిరీస్‌లో భారత బౌలర్లు ఓవర్‌కు సగటున 6.2 పరుగులు ఇచ్చారు. గత పదేళ్లలో స్వదేశంలో భారత్ ఆడిన వన్డే సిరీస్‌లలో ఇదే అత్యధికం. ఈ గణాంకమే భారత బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చెబుతోంది. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా అనుభవం తక్కువగా ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బ్యాటర్లు కూడా భారత బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్పిన్ విభాగం పూర్తిగా విఫలమైంది. ఒకప్పుడు భారత స్పిన్ బౌలింగ్ అంటే బ్యాటర్లకు నిద్ర లేకుండా చేసేది. కానీ ఈ సిరీస్‌లో ప్రత్యర్థిని స్పిన్‌తో కట్టడి చేయలేకపోవడమే. ఈ వైఫల్యం భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.
నిరాశ పరిచిన జడేజా
రవీంద్ర జడేజా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో జడేజా మొత్తం మూడు మ్యాచ్‌ల్లో ఆడాడు. కానీ 23 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ అతడి నుంచి ఆశించిన సహకారం రాలేదు. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి నిలబడి జట్టును గెలిపిస్తాడని అందరూ భావించిన సమయంలో కూడా జడేజా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతిలో నుంచి గెలుపు జారిపోవడానికి అతడి వైఫల్యం కూడా ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా… ఇప్పుడు వన్డే క్రికెట్లోనూ తన భవిష్యత్తుపై ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాతో పాటు క్రికెట్ వర్గాల్లో “జడేజా వన్డేల నుంచి కూడా తప్పుకోవాలా?” అనే డిమాండ్లు వినిపించడం గమనార్హం. జడేజాతో పాటు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. అతడు లైన్, లెంగ్త్ కోల్పోయి ధారాళంగా పరుగులు ఇచ్చాడు. వికెట్లు తీయడంలో విఫలమవడంతో పాటు, బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. మిడిల్ ఓవర్లలో భారత్ వెనుకబడింది.
సీమ్ బౌలింగ్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు 300 పరుగులకు పైగా స్కోరు చేయగలిగారు.కొత్త ముఖాలతో కూడిన కివీస్ జట్టు భారత గడ్డపై ఇంత భారీ స్కోరు చేయగలిగిందంటే… అది భారత బౌలర్ల వైఫల్యానికి అద్దం పడుతోంది. మిడిల్ ఓవర్లలో పట్టు వదిలేయడం వల్ల మ్యాచ్ చేజారిపోయిందని కెప్టెన్ గిల్ అంగీకరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
