CT2025: తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు

CT2025: తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
X
ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజయకేతనం ఎగరవేయడంతో రాజోలులో సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు బాణాసంచా కాల్చి ఇండియా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆదివారం దుబాయ్ లో న్యూజిలాండ్ పై ఇండియా విక్టరీ సాధించిన వెంటనే బాణాసంచా కాల్చారు. సర్పంచ్ జ్యోతి కేక్ కోసి అభిమానులకు పంచారు. యువకులు కేరింతలు కొడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు.

కరీంనగర్ లో బీజేపీ నాయకుల సంబరాలు

క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుపు సందర్భంగా బీజేపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. ఇండియా క్రికెట్ టీం ఛాంపియన్ ట్రోఫీ గెలుపొందిన సందర్భంగా బీజేపీ నాయకులు పవన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్ లోకేష్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, శ్రీనివాస్, శివానందం తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ అభిమానుల సంబరాలు

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నారాయణపేట పట్టణంలో క్రికెట్ అభిమానులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. పట్టణంలోని పలు విధుల్లో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చడంతో నారాయణపేట దద్దరిల్లింది. మూడవ సారి కప్ సాధించడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మేరా భారత్ మహాన్ అంటూ సందడి చేశారు.

అనంతపురంలో...

అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద క్రికెట్ అభిమానులు సందడి చేశారు. ఆదివారం రాత్రి టీఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో యువత డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. వరుసగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2 సార్లు కప్‌లు సాధించడంతో నగరంలోని క్రికెట్ అభిమానులు టపాసులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు చేతబట్టి ర్యాలీ చేశారు.

భువనగిరిలో..

ఛాంపియన్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో టీమిండియా గెలుపుపై యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆదివారం డీవైఎఫ్ఐ భువనగిరి పట్టణ కార్యదర్శి ఎండీ సలీం ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, డీవైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story