TENNIS: టెన్నీస్ చరిత్రలో భారత ఘన కీర్తి

భారత టెన్నిస్ భవిష్యత్‌కు శుభారంభం పలుకుతూ, జెన్సీ కానాబార్ అనే చిన్నారి ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్-14 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఒత్తిడి పరిస్థితుల్లో అసాధారణ పోరాట పటిమను కనబరిచి, అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగరవేసింది.
నవ శకం ఆరంభం
భారత టెన్నిస్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే భారత యువ టెన్నిస్ సంచలనం జెన్సీ కానాబార్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్-14 విభాగంలో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచింది. ఈ విజయంతో భారత క్రీడా ప్రపంచం మొత్తం గర్వంతో తలెత్తుకుంది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్ పోరు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ముసెమ్మా కిలెక్తో జరిగిన తుది సమరంలో జెన్సీ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. తొలి సెట్‌ను 3-6తో కోల్పోయిన ఆమె, రెండో సెట్లో కూడా 0-2తో వెనుకబడి ఓటమి అంచున నిలిచింది. అయితే ఆ కీలక సమయంలో అసాధారణ ఆత్మస్థైర్యం ప్రదర్శించిన జెన్సీ, ఆట తీరును పూర్తిగా మార్చింది. ప్రతి పాయింట్ కోసం పట్టుదలతో పోరాడిన జెన్సీ, ప్రత్యర్థి ఆటను అంచనా వేసి వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్‌లోకి తిరిగి వచ్చిన ఆమె, నిర్ణాయక సెట్లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 6-1 స్కోరుతో సెట్‌ను ముగించి, అద్భుత విజయం సాధిస్తూ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఓటమి అంచు నుంచి విజయం వరకూ సాగిన ఈ ప్రయాణం జెన్సీ పోరాట పటిమకు ప్రతీకగా నిలిచింది. జెన్సీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
భవిష్యత్తుపై భారీ ఆశలు
గత ఏడాది బాలుర విభాగంలో భారత యువ ఆటగాడు అర్ణవ్ పాపర్కర్ ఈ టైటిల్‌ను గెలుచుకోగా, ఇప్పుడు బాలికల విభాగంలో జెన్సీ అదే ఘనతను సాధించడం విశేషం. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ అండర్-14 విభాగంలో భారత టెన్నిస్ ఆధిపత్యం మరింత బలపడినట్లు క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌కు చెందిన జెన్సీ కానాబార్ చిన్న వయసులోనే టెన్నిస్‌పై అసాధారణ ప్రతిభ కనబరిచింది. దేశీయ స్థాయిలో ఆమె ఇప్పటికే ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) అండర్-14, అండర్-16 విభాగాల్లో నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుని తన సత్తా చాటింది. దేశీయ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శనతో నిపుణుల దృష్టిని ఆకర్షించిన జెన్సీ, అంతర్జాతీయ స్థాయిలోనూ అదే స్థాయిలో ప్రతిభను కొనసాగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
