CRICKET: టెస్ట్‌ కెప్టెన్‌గా గిల్.. వైస్ కెప్టెన్‌గా పంత్..!

రోహిత్ స్థానంలో సాయి సుదర్శన్‌?

రోహిత్‌ శర్మ టెస్ట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో టీమిండియా టెస్ట్ టీం కెప్టెన్ ఎవరు కానున్నారనేది ఆసక్తిగా మారింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం, కోహ్లీ కూడా అదే ఆలోచనలతో ఉండటంతో పాటు జస్ప్రీత్ బుమ్రా గాయాలతో టీంకు దూరం కావడంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం యంగ్ బాయ్ శుభ్‌మన్ గిల్‌ని కెప్టెన్‌గా, రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించనున్నారని తెలుస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ వహించే అర్హత ఉన్నప్పటికీ.. బుమ్రా గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుమ్రా ఫాస్ట్ బౌలర్ కాబట్టి సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బుమ్రాకు భారత టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందువల్ల భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ను నియమించే అవకాశం ఉంది. ఐపీఎల్ సిరీస్‌లో కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. మే చివరి వారంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా బీసీసీఐ ప్రకటించనుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్‌ కంటే పంత్‌ సీనియర్‌. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.

రోహిత్ స్థానంలో సాయి సుదర్శన్‌?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూరుకు ముందు అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. దీంతో కొత్త టెస్టు సారథిని ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ. అలాగే, టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే చర్చ కూడా జరుగుతుంది. ఓపెనర్ రేసులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. సారధులుగా ఈ యువ ఆటగాళ్లు ఎంతవరకూ సత్తా చాటుతారో చూడాలి.

Tags

Next Story