Rahul Dravid : జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దే. .రోహిత్ శర్మపై ద్రవిడ్ ప్రశంసలు

భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ద్రవిడ్.. తన కోచింగ్ ఫిలాసఫీ, రోహిత్‌తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఒక కోచ్‌గా నా అభిప్రాయం ప్రకారం జట్టు ఎప్పుడూ కెప్టెన్‌దే ఉండాలి. కెప్టెన్ నిర్దేశించిన మార్గంలోనే జట్టు ప్రయాణించాలి. కోచ్‌గా మనం అతనికి మద్దతుగా నిలవాలి’’ అని ద్రవిడ్ స్పష్టం చేశారు. రోహిత్ శర్మకు జట్టును ఎలా నడిపించాలనే దానిపై మొదటి రోజు నుంచే పూర్తి స్పష్టత ఉండేదని ఆయన కొనియాడారు. జట్టు పట్ల రోహిత్‌కు ఉన్న శ్రద్ధ, ఆటగాళ్లను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు చాలా గొప్పవని ద్రవిడ్ అన్నారు.
సారథ్యంలో అద్భుత విజయాలు
రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత జట్టు అద్భుత విజయాలను సాధించింది. వీరిద్దరి సారథ్యంలో టీమిండియా 2023 ఆసియా కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. అలాగే, 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు చేరుకుంది. ఈ విజయాల వెనుక తమ మధ్య ఉన్న బలమైన బంధం కూడా ఒక కారణమని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.
రోహిత్‌తో ద్రవిడ్ వ్యక్తిగత అనుబంధం
‘‘రోహిత్‌తో నా బంధం కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. మేమిద్దరం సాయంత్రం భోజనం చేస్తూ క్రికెట్‌తో పాటు ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం’’ అని ద్రవిడ్ గుర్తుచేసుకున్నారు. అండర్-19 స్థాయి నుంచి చూసిన ఒక ఆటగాడు అద్భుతమైన నాయకుడిగా ఎదగడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ద్రవిడ్ తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com