ఇంతింతై వటుడింతై..26 వేల కోట్లకు చేరిన IPL విలువ

ఐపీఎల్ విలువ 26 వేల కోట్లకు చేరింది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ఆదరణ, ఆదాయం, విలువ పరంగా ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతోంది.ఈ ఏడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా సుమారు 26,432 కోట్ల కు చేరినట్లు అమెరికాకు చెందిన హౌలిహన్ లోకీ అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇది దాదాపు 14,868 కోట్లుగా ఉంది.ఒక్క ఏడాదిలోనే ఐపీఎల్ విలువ వృద్ధి రేటు 80 శాతంగా నమోదు కావడం విశేషం.ఈ లీగ్ వ్యాపార సంస్థ విలువ కూడా 80 శాతం వృద్ధి రేటు అందుకుంది.
2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల కోసం వయాకామ్18, డిస్నీ స్టార్ కలిపి 48,390 కోట్లు చెల్లించడమే ఈ లీగ్ విలువ పెరుగుదలకు ముఖ్య కారణం. 2017తో పోలిస్తే 2023కు వచ్చే సరికి మీడియా హక్కుల వార్షిక వృద్ధి రేటు 196 శాతంగా ఉంది. ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్‌కు సంబంధించి ప్రసారదారు చెల్లించే మొత్తం అమెరికా జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం, ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్, బుండెస్‌లిగా కంటే ఎక్కువగా ఉంది. కేవలం అమెరికా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ మాత్రమే ఐపీఎల్ కంటే ముందుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com