ASIA CUP: భారత నుదిటిపై విజయ తిలకం

నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న ఆధిక్యం... గెలిచి తీరాలన్న పట్టుదల.. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ...వెరసి ఆసియా కప్ ఫైనల్లో ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. దాయాదిని చావు దెబ్బ కొడుతూ పాకిస్థాన్ పై ఉత్కంఠభరిత విజయం సాధించి టీమిండియా ఆసియా కప్ కైవసం చేసుకుంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కదనరంగంలో విజృంభిస్తున్న శత్రు సైన్యానికి ధైర్యంగా ఎదురు నిలిచిన సైనికుడిలా నిలబడ్డాడు. జీవిత కాల ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఆసియా కప్ లో మూడుసార్లు దాయాదిని మట్టికరిపించిన భారత్ సగర్వంగా ఆసియా కప్ ను కైవసం చేసుకుంది.
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది. 33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలో కష్టాలు తప్పలేదు.
భారత్ అంత పేలవంగా మొదలెట్టింది. 20కే 3 వికెట్లు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ పరిస్థితిది. టోర్నీలో అద్భుత ఆరంభాలనిచ్చిన అభిషేక్ (5) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం భారత్‌కు తొలి దెబ్బ. పేలవ షాట్ సెలక్షన్‌తో ఇంకొద్దిసేపట్లోనే సూర్య (1), గిల్ (12) పెవిలియన్ బాట పట్టారు.తిలక్ వర్మ. ఒత్తిడినంతా తట్టుకుంటూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. శాంసన్ కాస్త ఇబ్బంది పడ్డా కొన్ని షాట్లు ఆడడంతో 12 ఓవర్లలో 76/3తో భారత్ కోలుకుంది. శాంసన్ (24) ఓ అనవసర షాట్‌కు యత్నించి ఔట్ కావడంతో భారత్‌పై మళ్లీ ఒత్తిడి పెరిగింది. ఆఖరి ఆరు ఓవర్లలో 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ దశలో తిలక్ జోరు పెంచాడు.గెలవాలంటే ఆఖరి ఓవర్లో భారత్ 10 పరుగులు చేయాల్సిన స్థితి. మళ్లీ తిలకే బాధ్యత తీసుకున్నాడు. తొలి బంతికి 2 పరుగులు తీసిన అతడు రెండో బంతికి స్క్వేర్ లెగ్‌లో సిక్స్ కొట్టి భారత శిబిరంలో సంతోషాన్ని నింపాడు. తర్వాతి బంతికి అతడు సింగిల్ తీయగా.. రింకు ఫోర్‌తో ఛేదనను పూర్తి చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com