CRICKET: కుంభకర్ణుడిలా నిద్రపోయి ప్రపంచకప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు

అంతర్జాతీయ క్రికెట్‌లో నిద్రపోవడం వల్ల ఓ ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యాడంటే మీరు నమ్మగలరా... కానీ నమ్మి తీరాలి. ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లో మ్యాచ్ సమయం వరకూ నిద్రపోతూనే ఉండడం వల్ల ఓ బంగ్లాదేశ్ క్రికెటర్ భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. బంగ్లాదేశీ క్రికెటర్ నిద్ర పోవడం వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారే వెల్లడించడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర, వింత ఘటన జరిగింది. టీ 20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన తస్కిన్ అహ్మద్ భారత్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఆడలేదు. అయితే తస్కిన్ అహ్మద్‌ను జట్టులో మార్పుల వల్లే జట్టులోకి తీసుకోలేదని అనుకున్నారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు సంచలన ప్రకటన చేశారు. భారత్‌తో జరిగిన మ్యాచ్ రోజు తస్కిన్ అహ్మద్ చాలా సేపు నిద్రపోయాడని... అందుకే అతను టీమ్ బస్‌ను సకాలంలో ఎక్కలేదని తెలిపారు.
భారత్ మ్యాచ్ జరగాల్సిన రోజు బంగ్లా ఫాస్ట్ బౌలర్ తస్కిన్ అహ్మద్ ఆలస్యంగా నిద్ర లేచాడని.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదని... దీంతో టీమ్ బస్సు అతడు లేకుండానే బయలుదేరిందని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు. జట్టు సభ్యులు... బోర్డు అధికారులు ఫోన్ చేసినా తస్కిన్ అహ్మద్ ఫోన్ ఎత్తలేదని... దీంతో టీమ్ మేనేజ్ మెంట్ అధికారి హోటల్లోనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే ఆడింది. తస్కిన్ ఆలస్యంగా మైదానానికి చేరుకున్నప్పుటికీ అతనిని ప్లేయింగ్ లెవన్‌లోకి తీసుకోలేదు. తస్కిన్ అంటే కోచ్‌కు కోపం ఉందని అందుకే అతనిని జట్టులోకి తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిని బంగ్లా అధికారులు ఖండించారు. కోచ్‌కి తస్కిన్‌పై కోపం ఉంటే అఫ్గాన్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ప్లేయింగ్ లెవన్‌లో ఎందుకు ఉంటాడని ప్రశ్నించారు. తాను ఆలస్యంగా నిద్ర లేవడంపై తోటి ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు తస్కిన్ క్షమాపణలు కూడా చెప్పాడు.
రోహిత్ కాల్ వల్లే కోచ్‌గా...
భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్.. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం తన పదవికి వీడ్కోలు చెప్తాడని చాలామంది అనుకున్నారు. ద్రావిడ్ కూడా అదే చేద్దామనుకున్నాడు. కానీ అప్పుడు టీమిండియా సారధి రోహిత్ శర్మ చేసిన ఒక్క ఫోన్ కాల్...ద్రావిడ్‌ను కోచ్‌గా కొనసాగేలా చేసింది. ఆ ఒక్క ఫోన్ కాల్‌తోనే టీ 20 ప్రపంచకప్ 2024 దిశగా తొలి అడుగు పడింది. ఆ తర్వాత ద్రావిడ్ మార్గ నిర్దేశంలో... రోహిత్ సారథ్యంలో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అప్పుడు తనకు ఫోన్ కాల్ చేసి హెడ్ కోచ్‌గా ఉండేలా చేసిన రోహిత్ శర్మకు ద్రావిడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com