Ranji Trophy : రంజీ ట్రోఫీ బరిలో కోహ్లీ, పంత్

Ranji Trophy : రంజీ ట్రోఫీ బరిలో కోహ్లీ, పంత్
X

స్టార్‌ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీగా ఉంటారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడటం సాధ్యపడటం లేదు. ఇటీవల దులీప్‌ ట్రోఫీలో కోహ్లీ ఆడలేదు. పంత్ మాత్రం తొలి రౌండ్‌లో ఆడిన తర్వాత బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అయితే, రాబోయే రంజీ ట్రోఫీలో వీరిద్దరూ ఆడతారని ఢిల్లీ క్రికెట్ సంఘం తన ప్రాబబుల్స్‌ను ప్రకటించడం గమనార్హం. అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ ఎలైట్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. నవ్‌దీప్‌ సైని కూడా ఇందులో చోటు దక్కించుకున్నాడు. గత సీజన్‌లో ఆడిన సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు ఈసారి అవకాశం రాలేదు. మొత్తం 84 మందితో కూడిన ప్రాబబుల్స్‌ స్క్వాడ్‌ను దిల్లీ క్రికెట్ సంఘం ప్రకటించింది. ‘ఎంపిక చేసిన ప్లేయర్లకు సెప్టెంబర్ 26న ఫిట్‌నెస్ పరీక్షలు జరుగుతాయి. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే క్రికెటర్లను ఫిట్‌నెస్ టెస్టు నుంచి మినహాయింపు ఇస్తున్నాం’’ అని డీడీసీఏ వెల్లడించింది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు గతంలో శిఖర్ ధావన్‌, గౌతమ్‌ గంభీర్‌ తదితరులు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో కోహ్లీ రంజీ ట్రోఫీలో ఆడాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తీరిక లేకపోవడంతో కుదరనేలేదు. పంత్‌ కూడా 2016-17 సీజన్‌లో ఆడాడు. ఝార్ఖండ్‌పై కేవలం 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. దీంతో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఢిల్లీ ప్రాబబుల్స్‌లో విరాట్, పంత్‌కు అవకాశం కల్పించినా.. వారిద్దరూ బరిలోకి దిగడం కష్టమేనని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు. అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ ఆడనుంది. కోహ్లీ, పంత్‌ను పక్కనపెట్టడం అసాధ్యం. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత.. కొద్దిరోజులకే టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌తో తలపడనుంది.

Tags

Next Story