Cricket : విరాట్‌ కోహ్లీ ఓ అద్భుతం.. అంబటి రాయుడు ప్రశంసలు

Cricket : విరాట్‌ కోహ్లీ ఓ అద్భుతం.. అంబటి రాయుడు ప్రశంసలు
X

భారత క్రికెట్‌ చరిత్రలో విరాట్‌ కోహ్లీ ఒక అద్భుతమని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసించారు. కోహ్లీలో నైపుణ్యంతో పాటు, అద్భుతమైన ఫిట్‌నెస్‌ ఉందని, ఇది అతడికి అదనపు బలమని అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోహ్లీ గొప్పదనం గురించి రాయుడు వివరించారు. ‘‘విరాట్‌ కోహ్లీ భారత క్రికెట్‌ కోసం ఎంతో కృషి చేశాడు. రాబోయే వందేళ్లలో భారత జట్టు క్రికెట్‌ ప్రపంచాన్ని శాసించేలా అతడు బాటలు వేశాడు’’ అని రాయుడు అన్నారు. కోహ్లీ కేవలం గొప్ప బ్యాటర్ మాత్రమే కాదని, ఫిట్‌నెస్‌ విషయంలో టీమిండియాకు మార్గదర్శి అని కొనియాడారు. అతడి వల్లే భారత జట్టు ఫిట్‌నెస్‌లో అత్యున్నత ప్రమాణాలను అందుకుందన్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉంటే మానసికంగా కూడా బలంగా ఉంటారు.. ఇది క్రికెట్‌లో చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.

టెస్ట్ రిటైర్మెంట్‌పై ..

విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు కాస్త తొందరగానే రిటైర్మెంట్ ప్రకటించాడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘‘నా ఉద్దేశం ప్రకారం, కోహ్లీ ఇంగ్లాండ్ టూర్‌లో భాగమై ఉంటే బాగుండేది. అతడి ఫిట్‌నెస్‌ను చూస్తే, ఇంకా చాలా ఏళ్లు క్రికెట్ ఆడగలడు’’ అని రాయుడు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కోహ్లీ తన నిర్ణయంతో సంతోషంగా ఉన్నాడని భావిస్తున్నట్లు ఆయన తెలిపాడు

విరాట్‌ కోహ్లీ గణాంకాలు

కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 254. అలాగే 125 టీ20 మ్యాచ్‌ల్లో 4,188 రన్స్‌ సాధించాడు. ఇందులో ఒక శతకం, 38 అర్ధ శతకాలు ఉన్నాయి. 302 వన్డేల్లో 14,181 పరుగులు చేసి, 51 శతకాలు, 74 అర్ధ శతకాలు నమోదు చేశాడు.

Tags

Next Story