KL Rahul : ఆ ఘటనతో సరిగ్గా ఆడలేకపోయాం : కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2024లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. అంతేకాదు, ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టించాయి. సారథిని అలా పబ్లిక్‌గా నిలదీయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇటీవల ఐపీఎల్ రిటెన్షన్‌కు ముందు కేఎల్ రాహుల్ లఖ్‌నవూను వదిలేసి మెగా వేలంలోకి వచ్చేశాడు. తనకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చే జట్టులో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వ్యాఖ్యానించాడు. తాజాగా మరోసారి అప్పటి ఘటనపై ఓ క్రీడా ఛానల్‌తో సంభాషించాడు. ‘గత ఐపీఎల్‌లో మేం ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. అప్పటివరకు అన్నింట్లోనూ విజయం సాధించేందుకు చివరివరకూ ప్రయత్నించాం. కొన్ని మ్యాచ్‌లు ఓడిపోయాం. కానీ, ప్లేఆఫ్స్ చేరుకొనేందుకు అప్పటికీ ఇంకా మాకు ఛాన్స్‌లు ఉన్నాయి. చివరి ఐదు మ్యాచుల్లోనూ మూడు మేం గెలిస్తే మాకు అవకాశం ఉండేది. అప్పుడే ఆ ఘటన జరిగింది. మేమంతా షాక్‌కు గురయ్యాం. మైదానంలో ఏం జరిగినా ఫర్వాలేదు కానీ.. మ్యాచ్ తర్వాత చోటుచేసుకున్న సన్నివేశాలు సరిగ్గా లేవు. మా జట్టుపై తీవ్ర ప్రభావం పడింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్ ఉన్నప్పటికీ.. మళ్లీ గ్రూప్‌గా కలిసేందుకు ప్రయత్నించాం. అప్పటివరకు జరిగినవన్నీ పక్కనపెట్టేసి మరీ అడుగు ముందుకేశాం. కానీ, దురదృష్టవశాత్తూ మేం ప్లేఆఫ్స్‌కు చేరలేదు’ అని కేఎల్ వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com