CT 2025: తొలి సమరానికి టీమిండియా సిద్ధం

CT 2025: తొలి సమరానికి టీమిండియా సిద్ధం
X
నేడు భారత్, బంగ్లా మ్యాచ్... కళ్లన్నీ కోహ్లీపైనే

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 6 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో 5 గెలిచి, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్ టై చేసుకుంది. ఇక, CTలో భారత్ మొత్తం 29 మ్యాచ్‌లు ఆడగా, 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్ కీలకం కావడంతో బంగ్లాపై ఘన విజయం సాధించి.. మెగా టోర్నీలో శుభారంభం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. రోహిత్ శర్మ ఇప్పటికే ఫామ్‌లోకి రాగా.. కోహ్లీ ఫామ్ టీమిండియాను ఆందోళన పరుస్తోంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే టీమిండియాకు గెలుపు అంత కష్టమేమీ కాదు.

జోరుమీదున్న టీమిండియా

ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి జోరుమీదున్న భార‌త్.. ఐసీసీ టోర్నీలోనూ అదే ప్రద‌ర్శన చేయాల‌ని భావిస్తోంది. ఈ టోర్నీలో టీమిండియా తుది జట్టు కూర్పుపై మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. ఏ ఆట‌గాడిని రిజ‌ర్వ్ కు ప‌రిమితం చేయాలో, ఎవ‌రినీ ఆట‌గాడించాల‌నే అనే సందిగ్దత టీమ్ మేనేజ్మెంట్ ను వేధిస్తోంది. దీంతో బంగ్లాకు ముందు భార‌త్ ప్లేయింగ్ లెవ‌న్ ఎలా ఉండ‌బోతోందోన‌ని అటు అభిమానులతోపాటు ఇటు విశ్లేష‌కులు ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

భారమంతా షమీపైనే

ఛాంపియన్స్ ట్రోఫీకి పేసు గుర్రం బుమ్రా దూరం కావడం... టీమిండియాను కలవరపెడుతోంది. బుమ్రా దూరం కావడంతో భారత జట్టు బౌలింగ్ భారమంతా షమీ పైనే పడింది. బుమ్రా స్థానాన్ని షమీ భర్తీ చేస్తాడని.. అందులో అనుమానం వద్దని మాజీ పేసర్ బాలాజీ వెల్లడించాడు. లెఫ్టార్మ్ పేస‌ర్ అర్ష‌దీప్ ను ఆడిస్తే, వైవిధ్యంతోపాటు, అనుభ‌వం ఉన్న ఆట‌గాడిని బ‌రిలోకి దించిన‌ట్ల‌వుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. మ‌రో పేస‌ర్ హ‌ర్షిత్ రాణా కేవ‌లం మూడు వన్డేలు మాత్ర‌మే ఆడ‌టంతో అత‌ని కంటే అర్ష‌దీప్ సింగే మెరుగ‌ని అభిప్రాయం వ్య‌క్తం అవుతున్న‌ది.

Tags

Next Story