OLYMPICS: నేడే ఒలింపిక్స్ ఆరంభం

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'పారిస్ ఒలింపిక్స్' మరి కొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి గం.11కు ఈ వేడుకలు మొదలవుతాయి. ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రారంభ వేడుకలు ఓ నదిపై జరగనున్నాయి. 10వేల మందికిపైగా అథ్లెట్లు దాదాపు 100 బోట్లలో సెన్ నదిపై జరిగే పరేడ్‌లో పాల్గొంటారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఆతిథ్య నగరంలోని ప్రధాన స్టేడియంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి ఈ సంప్రదాయానికి తెరదించుతూ.. చరిత్రలో నిలిచేలా ఈ వేడుకలను పారిస్ నిర్వహించనుంది. తొలిసారిగా స్టేడియం వెలుపల, నదిపై ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందుకు పారిస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సెన్ నది వేదిక కానుంది. దీనిపై 6 కిలోమీటర్ల మేర పడవల్లో 205 దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు. ఇందుకోసం సుమారు 94 పడవలు ఉపయోగించనున్నారు. ఆరంభ వేడుకలకు 3 లక్షల 20 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశముంది.
నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు మన కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఆరంభం కానున్నాయి. పారిస్‌లోని సెన్ నది వేదికగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల దూరం... 205 దేశాలకు చెందిన 10 వేల 500 మంది అథ్లెట్లు పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్ కోసం 94 పడవలను సిద్ధం చేశారు. ఈ 94 పడవల్లో అథ్లెట్లు ఆరు కిలోమీటర్లు దూరం అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగనున్నారు. పరేడ్‌లో మొదటగా గ్రీస్ పరేడ్ నిర్వహించడనుండగా... 84వ దేశంగా భారత్ కవాతు నిర్వహించనుంది. 205వ దేశంగా చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ పరేడ్‌లో పాల్గొననుంది.
ఆరంభ వేడుకలకు దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు హాజరవుతారన్న అంచనాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. పారిస్ చుట్టూ 150 కిలోమీటర్ల మేర ఇప్పటికే నో ఫ్లై జోన్‌ను ప్రకటించారు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు ముందే విమానాలు వెళ్లకుండా పారిస్ గగనతలాన్ని మూసేస్తారు. డ్రోన్లు, జాగిలాలు, సీసీ కెమెరాలు, కృత్రిమ మేథ ఇలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫైటర్ జెట్లు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో భద్రతను కల్పించారు. భారత్‌కు చెందిన కే9 జాగిలాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com