WWC FINAL: కొత్త విశ్వ విజేతలు ఎవరో..?

దశాబ్దాల కల.. కోట్లాది అభిమానుల ఆశ.. సొంతగడ్డపై అద్భుతం చేయాలనే తపన నడుమ ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ వేటకు సిద్ధమైంది. 47 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఫైనల్ కు చేరుకున్న ఇండియా ఈ సారి ఎలాగైనా టైటిల్ ను ముద్దాడాలని హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని జట్టు పట్టుదలగా ఉంది. లీగ్ దశలో కొంచెం తడబడినా సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేడు సౌతాఫ్రికాతో ఫైనల్లో గెలిచి సొంతగడ్డపై ట్రోఫీ కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తుంది.
ముచ్చటగా మూడోసారి...
12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకోని ప్రపంచ ఛాంపియన్ లుగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 47 ఏళ్ళ మహిళల వన్డే చరిత్రలో భారత క్రికెట్ జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వచ్చినా తుది మెట్టుపై బోల్తా పడింది. 12 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియాలో వరల్డ్ కప్ జరగనుండడంతో ఫ్యాన్స్ ఈ సారి మన మహిళల జట్టు ట్రోఫీ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జట్టుతో వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2005 లో తొలిసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సమరంలో ఘోరంగా ఓడిపోయింది. 2017 టోర్నీలో ఫైనల్లో ఇండియా కేవలం 9 పరుగుల తేడాతో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది.
ఆత్మ విశ్వాసంతో భారత్
ఈసారి ఫైనల్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మహిళా క్రికెట్‌కు కొత్త ఛాంపియన్ లభించబోతోంది. సరిగ్గా 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో కొత్త ఛాంపియన్‌ను నిర్ణయించనున్నారు. ఇంతకుముందు 2000లో ఇలా జరిగింది. అప్పుడు న్యూజిలాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి తొలిసారిగా, ఏకైకసారి టైటిల్‌ను గెలుచుకుంది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా కేవలం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాత్రమే అన్ని టైటిళ్లను గెలుచుకున్నాయి. ఈ విధంగా ప్రపంచ క్రికెట్‌కు నాల్గవ ఛాంపియన్ జట్టు లభించనుంది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత జట్టు పూర్తి ఆత్మ విశ్వాసంతో తుది పోరుకు సిద్ధం కానుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు రెండు రోజులే ఉంది. మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా అవరించే జట్టేదే ఆదివారం తేలిపోనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లలో ట్రోఫీని కొల్లగొట్టేది ఎవరు? అని ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

