WWC: ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా

హ్యాట్రిక్ ఓటములు.. సెమీస్ ఆశలు ఆవిరవుతున్నవేళ అందరిలో ఆందోళన.. గెలుపే శరణ్యం అయిన మ్యాచ్‌లో భారత జట్టు పంజా విసిరింది. బ్యాటింగ్. బౌలింగ్. ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతీకా రావల్(122), స్మృతి మంధాన(109)లు శతకాలతో కదం తొక్కగా.. సమిష్టిగా రాణించి న్యూజిలాండ్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. 325 పరుగుల ఛేదనలో ప్రత్యర్ధిని కట్టడి చేసి ..డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 53 పరుగుల తేడాతో గెలుపొంది ఐదోసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో చివరిదైన నాలుగో సెమీస్ బెర్తును భారత జట్టు ఖరారు చేసుకుంది. ఈ ఫలితంతో న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు ఇప్పటికే సెమీస్ చేరాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రతీక, మంధాన శతక గర్జన
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్.. ఆ నిర్ణయానికి ఎంతో చింతించేలా సాగింది భారత ఇన్నింగ్స్. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మినహా జట్టుకు ఆశించిన ఆరంభాన్నివ్వలేకపోయిన స్మృతి, ప్రతీక.. లెక్కలన్నీ సరి చేసేలా అద్భుత భాగస్వామ్యంతో జట్టుకు బలమైన పునాది వేశారు. స్మృతి తనదైన శైలిలో చెలరేగిపోతే.. ప్రతీక సంయమనంతో ఆడుతూ, అవకాశం చిక్కినపుడల్లా షాట్లు ఆడింది. ఇటు వికెట్ పడక, అటు పరుగులు ఆగక కివీస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. స్మృతి 49 బంతుల్లోనే అర్ధశతకం సాధించగా.. ప్రతీక 75 బంతుల్లో ఈ మార్కును చేరుకుంది. 18వ ఓవర్లో వంద దాటిన భారత్.. 33వ ఓవర్‌కే 200 మార్కును చేరుకుంది. ఈలోపే స్మృతి 88 బంతుల్లోనే శతకాన్నందుకుంది.
అందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ప్రతీక కూడా సెంచరీ వైపు అడుగులు వేసింది. పార్ట్ టైం స్పిన్నర్ సుజీ బేట్స్ కివీస్ నిరీక్షణకు తెరదించింది. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించిన స్మృతి బౌండరీ వద్ద హన్నా రోవ్‌కు క్యాచ్ ఇచ్చింది. తర్వాత ప్రతీక.. జెమీమాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. కాసేపటికే ఆమె మూడంకెల స్కోరును (122 బంతుల్లో) అందుకుంది. ఆ తర్వాత ప్రతీక ఔటైనా.. అప్పటికే క్రీజులో కుదురుకున్న జెమీమా.. ఆఖరి ఓవర్లలో చెలరేగి ఆడింది. హర్మన్‌ప్రీత్ (10) మరోసారి నిరాశపరిచినా.. జెమీమా మెరుపులతో భారత్ భారీ స్కోరు సాధించింది.
కివీస్ పోరాడినా...
భారత్ ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ వర్షం కురిసింది. దీంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. ఆరంభం నుంచి వికెట్లు తీసిన భారత బౌలర్లు.. టీమిండియా విజయాన్ని ఖరారు చేశారు. చివర్లో న్యూజిలాండ్ బ్యాటర్లు బ్యాట్ ఝుళిపించినా.. అప్పటికే భారత్ విజయం ఖరారైపోయింది. చివరకు నిర్ణీత 44 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత్.. 53 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ ప్రకారం) గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

