WWC: మహిళా ప్రపంచకప్..నేడు భారత్-పాక్ పోరు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో శుభారంభం చేసిన భారత్.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నేడు కొలంబో వేదికగా జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025 టోర్నీలో ఇరు జట్ల మధ్య అనేక వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి.
నో షేక్ హ్యాండ్ కంటిన్యూ..
పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. ఇరు జట్లు ఐసీసీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని నిరాకరించేందుకు భారత్ నిరాకరించింది. దాంతో ఆ ట్రోఫీని నఖ్వీ తన వెంట తీసుకెళ్లాడు. ఇప్పటికీ ఆ ట్రోఫీని భారత్ అందుకోలేదు. ఇరు జట్ల మధ్య ఈ ఘటనపై తీవ్ర వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ వరుస సంఘటనలు భారత్, పాక్ మహిళల మ్యాచ్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పాకిస్థాన్ మహిళా ప్లేయర్లకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేసింది. మైదానంలో ఇరు జట్ల మధ్య మాటల యుద్దం నడిచే అవకాశం ఉంది. ప్రస్తుత ఫామ్ చూసుకున్నా.. గత రికార్డులను పరిగణలోకి తీసుకున్నా భారత మహిళల జట్టుకు పాకిస్థాన్ మహిళల టీమ్ ఏ మాత్రం పోటీ కాదు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 వన్డేలు జరగ్గా.. అన్ని మ్యాచ్‌లను టీమిండియానే గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com