Yuvraj Singh : సినీ నటితో డేటింగ్ చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన యువరాజ్ సింగ్

2007 టీ20, 2011 వన్డే ప్రపంచ కప్‌లను నెగ్గడంలో టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన అతడి వ్యక్తిగత విషయాలు కూడా సంచలనమే. క్యాన్సర్ నుంచి కోలుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా పర్యటన(2007/08) సమయంలో తను ఎదుర్కొన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అప్పుడే మంకీ గేట్ వివాదం తీవ్రస్థాయిలో బయటపడింది. ఇరు జట్ల మధ్య ఉద్విగ్న వాతావరణం కనిపించింది. అలాంటి సమయంలోనూ యువీ డేటింగ్ చేసినట్లు చెప్పాడు.
‘గతంలో నేను ఓ సినీ నటితో డేటింగ్ చేశా. ఆ సమయంలో ఆమె కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అడిలైడ్‌లో షూటింగ్ కోసం వచ్చింది. మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. అప్పుడే ఒక మాట చెప్పా. దయ చేసి నువ్వు ఇక్కడికి రావద్దు. నేను గేమ్‌పై దృష్టిపెట్టాలి. ఇది ఆసీస్‌తో టెస్టు సిరీస్ అని అన్నా. కానీ ఆమె వినకుండా కాన్‌బెర్రాకు వచ్చేసింది. అప్పటికే నేను తొలి రెండు టెస్టుల్లో పెద్దగా పరుగులు చేయలేదు. ఆమెను చూశాక..నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అని అడిగా. నీతో సమయం గడుపుదామని వచ్చానని చెప్పింది. ఆమెతో ఆ రోజు ఉండిపోయా. ఇక నువ్వు నీ కెరీర్ మీద దృష్టిపెట్టు. నేను నా పని మీద ఉంటానన్నా. ఆ తరువాత కాన్‌బెర్రా నుంచి అడిలైడ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యా. నా సూట్‌కేస్‌ను తనే ప్యాక్ చేసింది. ప్రయాణం చేయాల్సిన రోజు ఉదయం నా షూ ఎక్కడ అని అడిగా. వాటిని కూడా ప్యాక్ చేసినట్లు చెప్పింది. మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని అడిగా. తన షూ వేసుకొని వెళ్లమని చెప్పింది. అప్పుడు తనకు పింక్ స్లిప్పర్లు ఉన్నాయనుకుంటా. ఓరి దేవుడా నాకెంత కష్టం వచ్చిపడిందనుకున్నా. వాటిని వేసుకొని నిదానంగా బస్సు దగ్గరకు వచ్చేశా. నా లగేజీ బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని కనిపించకుండా చేశా. అయితే, సహచరుల్లో కొందరు చూసేశారు. చప్పట్లు కొట్టి మరీ ఆట పట్టించారు. వేరేవి తీసుకొనేవరకూ పింక్ స్లిప్పర్లతోనే ప్రయాణించా’ అని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. అయితే, ఆ సినీ నటి ఎవరనేది యువీ వెల్లడించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com