Jasprit Bumrah : అలా చేస్తే.. రికార్డులన్నీ బుమ్రావే : జహీర్‌ ఖాన్

Jasprit Bumrah : అలా చేస్తే.. రికార్డులన్నీ బుమ్రావే : జహీర్‌ ఖాన్
X

అంతర్జాతీయంగా 400కు పైగా వికెట్లు తీసిన ఆరో భారత ఫాస్ట్‌ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(687), జహీర్‌ ఖాన్ (597) ముందున్నారు. అయితే, బుమ్రా ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కలిపి 402 వికెట్లు పడగొట్టాడు. తాజాగా బుమ్రాపై జహీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఇదే ఫిట్‌నెస్‌ కొనసాగిస్తే భవిష్యత్తులో రికార్డులన్నింటినీ అధిగమిస్తాడని జహీర్‌ పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌ శైలి ప్రత్యేకమని.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అతడేనని కొనియాడాడు. అయితే, ఫిట్‌నెస్‌పై కఠిన శ్రమ పెట్టాలని సూచించాడు. సహచర పేసర్ వికెట్లు తీస్తుంటే సంతోషం కలుగుతుందన్నాడు. ‘కెరీర్‌లో 400కు పైగా వికెట్లు తీయడం సాధారణ విషయం కాదు. పేసర్‌కు అత్యంత కష్టమైనదే. బౌలర్‌గా ఇలాంటి మైలురాయిని అందుకోవడం ఎప్పుడూ ప్రత్యేకమే. బుమ్రా ఇలాగే ఆడితే.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేస్తాడు. ప్రస్తుతం ఉన్న పేసర్లలో అతడే నంబర్‌వన్ బౌలర్. అయితే, తన శరీరాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్‌నెస్‌పై నిరంతరం జాగ్రత్తలు వహించాలి. ఎంత ఎక్కువగా ఆడితే.. అన్ని రికార్డులను అధిగమిస్తాడు. భారత్‌ పిచ్‌లపై పేస్‌ను రాబట్టడం సులువేం కాదు. కానీ, బుమ్రా వంటి వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌కు పరిస్థితులతో సంబంధమే లేదు. అసాధారణ పరిస్థితుల్లోనూ ఎలాంటి ఆయుధాలను సంధించాలనే దానిపైనే దృష్టిపెడతారు. అతడు పరిపూర్ణ బౌలర్. స్వింగ్, సీమ్‌కు అనుకూలంగా ఉంటే బుమ్రాను ఆపడం ఎవరితరమూ కాదు. అలా లేనప్పుడే ఆడటం చాలా కష్టం. యార్కర్లు, స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేస్తాడు’ అని జహీర్‌ పేర్కొన్నాడు.

Tags

Next Story