AI: ఏఐ రాకతో భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం

నెట్వెబ్ టెక్నాలజీస్, హైఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ (హెచ్‌సీఎస్) విభాగంలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చరర్ (ఓఈఎం) సేవలు అందించే సంస్థ.. ఎన్విడియా నుంచి రూ.1,734 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది. అలాగే, ఈ2ఈ నెట్వర్క్స్ లిమిటెడ్ అనే మరో సంస్థకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి రూ.177 కోట్ల విలువైన జీపీయూ రిసోర్సెస్ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్లు భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వేగవంతమైన పురోగతి మరియు ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు ఉదాహరణలుగా నిలుస్తాయి. ఇండియా ఏఐ మిషన్ కింద, దేశీయ ఏఐ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతోంది, ఇందులో ఎన్విడియా ఆర్డర్ నెట్వెబ్ టెక్నాలజీస్‌కు గణనీయమైన ఊతాన్నిస్తుందని పేర్కొంది.
అంచనాల్లో మార్పు
డేటా సెంటర్ల విస్తరణపై విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. క్లౌడ్ సేవల ఆధారంగా, ద్వితీయ శ్రేణి నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, తిరుపతి, నిజామాబాద్, కర్నూలు వంటి ప్రాంతాల్లో 10 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం గల ఎడ్జ్ డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని భావించారు. అయితే, ఏఐ విస్తరణ, సాంకేతిక ఆవిష్కరణలతో ఈ అంచనాలు పూర్తిగా మారాయి. ఫలితంగా, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, టెక్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా భారీ డేటా సెంటర్లు విస్తరిస్తున్నాయి. భారీ డేటా సెంటర్ల ఏర్పాటుతో మెట్రో నగరాల్లో వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్ పెరుగుతోంది.
విదేశీ టెక్ దిగ్గజాల ఆసక్తి
భారత సంస్థలతో పాటు, విదేశీ టెక్ దిగ్గజాలు కూడా భారత్‌లో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. విశాఖపట్నంలో గూగుల్ 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని సంస్థలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మైక్రోసాఫ్ట్ కూడా క్లౌడ్ మరియు ఏఐ మౌలిక సదుపాయాల కోసం 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది.
ఏఐ డేటా సెంటర్ల విస్తరణ
‘చాట్‌జీపీటీ’ని రూపొందించిన ఓపెన్ఏఐ, భారత్‌లో 1 గిగావాట్ సామర్థ్యం గల అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం హైదరాబాద్‌లో లేదా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. చాట్‌జీపీటీని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దీనికోసం భారీ డేటా ప్రాసెసింగ్ అవసరం. ఈ నేపథ్యంలో, ఓపెన్ఏఐ ఇక్కడ డేటా సెంటర్ నిర్మాణానికి సిద్ధమైంది. కేంద్రం ఇండియా ఏఐ మిషన్ కోసం 1.2 బిలియన్ డాలర్లను కేటాయించింది, ఇది డేటా సెంటర్ల రంగంలో వేగవంతమైన అభివృద్ధికి దోహదం చేస్తుంది.
స్థిరాస్తి రంగంలో గిరాకీ
ఏఐ, క్లౌడ్, డిజిటల్ కనెక్టివిటీల వల్ల డేటా సెంటర్ల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని నెక్స్ట్రా సీఈఓ ఆశిష్ అరోరా తెలిపారు.డేటా సెంటర్లకు భవనాలను నిర్మించి లీజుకు ఇచ్చే అవకాశాలు రియల్ ఎస్టేట్ సంస్థలకు లభిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com