Data Centers: నిజమవుతున్న హాలీవుడ్ సినిమాలు.. చంద్రుడి మీద డేటా సెంటర్ల ఏర్పాటు.

Data Centers: హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే దృశ్యాలు త్వరలోనే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అంగారక గ్రహంపై మానవ నివాసాలు ఏర్పాటు చేయాలనే పట్టుదల ఒకవైపు కొనసాగుతుండగానే, ఇప్పుడు అంతరిక్షంలో ముఖ్యంగా చంద్రుడిపై డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కృత్రిమ మేధస్సు సాధనాల రాకతో మనిషికి అవసరమైన విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచంలోని దిగ్గజ టెక్ సంస్థల దృష్టి ఇప్పుడు భూమి ఆవల పడింది.
భూమిపై పెరుగుతున్న సమస్య
మనం రోజువారీగా ఉపయోగించే భారీ డేటాను నిర్వహించడానికి పెద్ద పెద్ద డేటా సెంటర్‌లు అవసరం. ఈ సెంటర్‌లను నడపడానికి భారీ మొత్తంలో విద్యుత్ కావాలి. అంతేకాదు ఆ వేడిని తగ్గించడానికి (కూలింగ్) చాలా నీరు లేదా అతి తక్కువ ఉష్ణోగ్రత అవసరం. ప్రస్తుతం ఈ సమస్యలను భూమిపై ఏదో విధంగా నిర్వహించగలుగుతున్నా, భవిష్యత్తులో AI మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు అపారమైన డేటా సెంటర్‌లు అవసరం అవుతాయి. ఆ సమయంలో భూమిపై ఉన్న వనరులు, ముఖ్యంగా విద్యుత్, చల్లదనం సరిపోకపోవచ్చు. అందుకే గూగుల్, ఎన్విడియా, అమెజాన్ వంటి సంస్థలు భూమి ఆవల పరిష్కారం కోసం చూస్తున్నాయి.
గూగుల్, చైనా ప్రయోగాలు
గూగుల్ సంస్థ సన్‌క్యాచర్, మూన్‌షాట్ అనే ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. భూమి కక్ష్యలో ఉపగ్రహాల ద్వారా సౌరశక్తితో పనిచేసే AI డేటా సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి ఈ ప్రయోగాలు మొదలయ్యాయి. అంతరిక్షంలో, డేటా సెంటర్‌లకు అవసరమైన సూర్యశక్తి, సహజమైన చల్లదనం పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా చైనా కూడా దిగువ భూ కక్ష్యలో 12 AI-శక్తితో పనిచేసే ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇది విజయవంతమైతే, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్బిటల్ సూపర్ కంప్యూటర్ నెట్‌వర్క్ ఇదే అవుతుంది.
AI మౌలిక సదుపాయాలకు చంద్రుడు బెస్ట్
AI మౌలిక సదుపాయాలను నిర్మించడానికి భూమి కంటే చంద్రుడు చాలా అనుకూలమని నిపుణులు నిర్ధారించారు. చంద్రుడిపై చాలా విస్తృతమైన సూర్యరశ్మి (విద్యుత్ కోసం) లభిస్తుంది. అంతేకాకుండా, దాని గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వలన నిర్మాణ పనులు కూడా సులభతరం అవుతాయి. ఈ కారణంగా AI మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చంద్రుడే సరైన ప్రదేశమని నిపుణులు భావిస్తున్నారు.
జెఫ్ బెజోస్ ఆకాంక్ష
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. "మనం భూమిని తప్పకుండా కాపాడాలి. ప్లాన్ బి అనేది లేదు" అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే ఆయన ప్రకారం చంద్రుడు భూమి తదుపరి వర్క్ సైటుగా మారడం ఖాయం. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ, చంద్రుడి కక్ష్యలో AI మౌలిక సదుపాయాలను నిర్మించడానికి సహాయపడే రాకెట్లు, ల్యాండర్‌లను ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

