ఉ.9 తర్వాతే స్కూల్స్ ఓపెన్.. మహా సర్కార్ కీలక నిర్ణయం

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ కేజీ, యూకేజీ నుంచి నాలుగో తరగతి వరకు జరిగే తరగతుల సమయాలపై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల తర్వాతే క్లాసులు ప్రారంభించాలని.. ఉదయం 9 గంటలలోపు స్కూల్స్ ఓపెన్ చేయొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ సమయపాలన ఫాలో అవ్వాలని ఆదేశించింది. ఉదయం 9 గంటల కంటే ముందే పాఠశాలలు ప్రారంభం కావటం వల్ల.. పిల్లలకు నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయని.. నిద్ర సరిపోవటం లేదని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ఇంటర్నెట్ యుగంలో విద్యార్థులు ఎక్కువగా మొబైల్ ఫోన్, కంప్యూటర్ లాంటి ఇతర సాధనాలకు అలవడి రాత్రి, పగలు అనే తేడా లేకుండా వాటితో సమయం గడుపుతున్నారు. మరికొందరు పిల్లలు రాత్రి సమయంలో ఆలస్యంగా పడుకుంటున్నారు. వారికి ఉదయాన్నే తర్వగా లేచి పాఠశాలకు వెళ్లాలంటే తీరని సమస్యగా మారింది. దీని వల్ల వారు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ టైమింగ్స్ మారుస్తూ ఆదేశాలు జారీ చేశామన్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ (Deepak Kesarkar) చెప్పారు. అయితే ఈ నిర్ణయానికి కొందరు మద్దతు చేస్తుండగా.. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com