TG : ఈ సీజన్ నుంచే సన్నాలకు రూ.500 బోనస్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల పక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో మొత్తాలను జమచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్ రావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సీఎం ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలు కాకుండా.. ఎక్కడైనా కొనుగోలు కేంద్రం అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com