Godavari Kaveri: గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కేంద్రం కీలక సమావేశం..

Godavari Kaveri: గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కేంద్రం కీలక సమావేశం..
X
Godavari Kaveri: నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

Godavari Kaveri: నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రెండు నదులను అనుసంధానం చేయాలని సంకల్పించింది. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం చేయాలని ముందుగా భావించింది కేంద్రం. అయితే, ప్రస్తుతం గోదావరి- కావేరి అనుసంధానంపై ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.

జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జలశక్తిశాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి అధికారులు హాజరయ్యారు. 237 టీఎంసీల జలాల తరలింపుపై సమావేశంలో చర్చించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపుపై కూడా భేటీలో చర్చ జరిగింది.

గంటన్నరపాటు జరిగిన సమావేశంలో జలశక్తిశాఖ అధికారులు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. జాతీయ ప్రాజెక్టుల ద్వారా లబ్ధిపొందే రాష్ట్రాలు 40శాతం నిధులు భరించాల్సి ఉంటుందని కేంద్రం కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగా ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులు భరించనుంది కేంద్రం.నదుల అనుసంధానానికి అవసరమైన భూసేకరణ, ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు అనుసంధానం చేయొచ్చన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు.

గోదావరి మిగులు జలాల లభ్యతపై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మిగులు జలాల లెక్క తేలాకే అనుసంధానం అని తేల్చిచెప్పింది. తాము నదుల అనుసంధానికి వ్యతిరేకం కాదన్న తెలంగాణ.. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగరాదని పేర్కొంది. అటు పోలవరం ప్రాజెక్టు నుంచే అనుసంధానం చేపట్టాలని ఏపీ కోరింది. గోదావరిలో మిగులు జలాలను తరలించడం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు అసలు నదుల అనుసంధానంతో ప్రయోజనం ఏంటో చెప్పాలని కేంద్రాన్ని కర్ణాటక ప్రశ్నించింది. ఏ ప్రాజెక్టు చేపట్టినా తమకు అభ్యంతరం లేదని తమిళనాడు, పుదుచ్చేరి అధికారులు చెప్పినట్టు జలశక్తి శాఖ వర్గాలు వెల్లడించాయి. ఐదు రాష్ట్రాలు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి తదుపరి సమావేశంలో గోదావరి-కావేరి అనుసంధానంపై డీపీఆర్‌లో మార్పులు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Tags

Next Story