ఓ తల్లి ఆవేదన.. కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని!

కన్న కొడుకు, ఇంటి కోడలు తనను చూడడం లేదంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు బోరునా విలపించింది ఓ తల్లి. కోదాడ పట్టణం గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సోమపంగు వెంకమ్మ, కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, రిటైర్ అయ్యింది. ఈ క్రమంలో తనకు ఉన్న ఒక్క గానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం తన కడుపుకి పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ, కన్నీరు మున్నీరుగా విలపించింది. పదవీ విరమణ పొందిన తరువాత, తనకు వచ్చే 35 వేల పించన్ కూడా తన వద్ద నుంచి కొడుకు కోడలు లాక్కుంటున్నారని వాపోయింది. అలాగే తన పేరు మీద ఉన్న ఎకరంన్నర భూమిని, తన ఇంటిని కూడా తన కోడలే తన పేరు మీదకు బలవంతంగా రాయించుకున్నదని భావోద్వేగానికి లోనయ్యారు. తన తరఫున మాట్లాడడానికి వచ్చిన తన కూతుర్లపై కూడా కేసులు పెడుతున్నారని, తన తరఫున ఎవరు మాట్లాడడానికి వచ్చినా వాళ్ళపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వెంకమ్మ కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న డీఏవో రామకృష్ణా రెడ్డికి తన గోడును వెళ్లబోసుకుని కాళ్లపై పడి వినతిపత్రం అందజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com