Aarogyasri : యూనిక్ ఐడీతో ఆరోగ్యశ్రీ కార్డులు!

రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కార్డుల తరహాలో కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని యూనిక్ ఐడీతో ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది. దీనినే హెల్త్ ప్రొఫైల్‌కు లింక్ చేసి, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనున్నట్లు సమాచారం. అందరికీ పథకాన్ని వర్తింపజేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి రూ.1,100 కోట్లు ఖర్చవుతుండగా అదనంగా రూ.400 కోట్లు పెరగొచ్చని అంచనా. రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. మిగిలిన 40 లక్షల కుటుంబాల్లో సుమారు 15 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది. వీళ్లు పోను ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలు మాత్రమే మిగులుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ ఎస్ , పోలీసులకు ఆరోగ్య భద్రత, సింగరేణి వంటి కార్పొరేషన్ల ఉద్యోగులకు ఆ సంస్థలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా హెల్త్ ఇన్సూరన్స్ తీసుకుంటున్నారు. పేద కుటుంబాలకు చెందినవారే ఆరోగ్యశ్రీ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని అందరికీ వర్తింపజేయడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడదని అధికారులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com