CM Revanth Reddy : ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చి పెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపైన అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునరవ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించారు.
ఎంచుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకా నెలా మంత్లీ టార్గెట్ ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com