TPCC: నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం

తెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే దిల్లీ వెళ్లారు. ముంబైలో ఆదివారం రాత్రి సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించి పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం., మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ ఉండటంతో నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి వదిలేసినట్లు తెలిసింది. ఖమ్మం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాదరెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా, తాజాగా మాజీఎంపీ ఆర్.సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సురేందర్‌రెడ్డి కుమారుడు పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే... తుది పోటీ ప్రసాదరెడ్డి, నందిని మధ్యనే ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భువనగిరి స్థానానికి మెుదటి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీలో ఉండగా, తన భార్య లక్ష్మికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారు. గుత్తా అమిత్‌రెడ్డి కూడా రంగంలోకి వచ్చినా తొలినుంచి పార్టీలో ఉన్నవారి మధ్య పోటీ ఉండటంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా నాగార్జునసాగర్‌కు చెందిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఈ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈయన సినీనటుడు అల్లు అర్జున్‌కు మామ. మెదక్ స్థానానికి ఇప్పటివరకు నీలం మధు ముదిరాజ్, మైనంపలి హన్మంతరావు పేర్లు వినిపించాయి. తాజాగా ఓ పారిశ్రామికవేత్తతో పాటు, శేరిలింగంపల్లికి చెందిన రఘునాథ్ యాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది.
సామాజిక సమీకరణాల్లో నాగర్‌కర్నూల్., వరంగల్ స్థానాలపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. చేవెళ్ల లోక్‌సభ నుంచి సిట్టింగ్ ఎంపీ, భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి పేరును సిఫార్సు చేశారు.పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరికి ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్ కుమారుడు... వంశీకృష్ణ బరిలో దిగనున్నారు. ఆదిలాబాద్‌కు వెడ్మబొజ్జు, డాక్టర్ సుమలత, నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కరీంనగర్‌కు ప్రవీణ్‌రెడ్డి, రాజేందర్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో ఏకాభిప్రాయానికి వచ్చిన స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com