DG Soumya Mishra : నిబంధనల ప్రకారమే అల్లు అర్జున్ విడుదల: డీజీ సౌమ్య మిశ్రా

అల్లు అర్జున్ విడుదలకు సంబంధించి జైళ్ల శాఖలో ఎలాంటి లోపం లేదని డీజీ సౌమ్య మిశ్రా స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఆయనను రిలీజ్ చేశామన్నారు. గత నెల 13న బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా, అదే రోజు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అప్‌లోడ్ కావడంతో ఆయనను ఆ రోజు రాత్రి జైల్లోనే ఉంచి తర్వాతి రోజు విడుదల చేశారు. దీంతో పోలీసులు కావాలనే అలా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ విడుదల సమయంలో వెనుక గేట్ నుండి పంపడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు జైల్ డీజీ సౌమ్య మిశ్రా. అల్లు అర్జున్ ను జైలు వెనుక గేటు నుండి పంపడంలో తమ నుండి ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు సౌమ్య మిశ్రా. జైళ్ల వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు సౌమ్య. ‘‘2024లో కోర్టు విచారణలో 30,153 కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 483 మందిని జైలు నుంచి విడుదల చేశాం. 303 మందికి పెరోల్ ఇచ్చాం. ఈ-ములాఖత్ ద్వారా ఖైదీల కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించాం. 2,650 మంది ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఇప్పిచ్చాం. 12,650 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాం" అని ఆమె చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com