CM Revanth Reddy : అమెరికా-తెలంగాణ బంధం ఎంతో ప్రత్యేకమైనది

అమెరికా తెలంగాణల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఇచ్చిన దౌత్యపరమైన విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమెరికా - తెలంగాణల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు మరింత మెరుగుపరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణను 2035 నాటికి 1ట్రిలియన్ డాలర్, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ దార్శనికతతో పని చేస్తున్నామన్నారు. అందుకు అమెరికన్ల మద్దతు కావాలని కోరారు. “అమెరికాకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలతో ప్రపంచ దృక్కోణాన్ని మార్చింది. ఎల్లప్పుడూ బలమైన దేశంగా.. అనేక అంశాల్లో సానుకూల పరిష్కారాలు చూపించడంలో అమెరికా స్ఫూర్తిని ప్రదర్శించింది. అమెరికా స్ఫూర్తికి తెలంగాణ స్ఫూర్తికి మధ్య ఎంతో సారూప్యత ఉంది. స్నేహ బంధాన్ని కోరుకోవడమే కాకుండా దాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత’’ అని సీఎం అన్నారు.
2008 లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైందనని రేవంత్ చెప్పారు. దేశంలో ప్రారంభించబడిన మొట్టమొదటి యూఎస్ దౌత్య కార్యాలయం ఇదే కావడం గమనార్హమన్న సీఎం.. భారత్ తో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎప్పుడూ నిబద్ధతని ప్రదర్శించిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైందని.. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ గారు రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, అలాగే వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో, ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయని రేవంత్ గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా - భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్ మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com