AP and Telangana Rains: రానున్న 12 గంటల్లో బలహీనపడనున్న వాయుగుండం
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు వరద పోటెత్తింది. ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతితో పది కార్లు కొట్టుకుపోయాయి. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కోదాడ వద్ద దారి మళ్లిస్తున్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత
వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండడంతో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు ప్రాజెక్ట్ గేట్లకు పడవలు అడ్డుపడడంతో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మొత్తం 70 గేట్లు తెరిచి 11.40 లక్షల క్యూసెక్కల నీరును దిగువకు విడుదల చేస్తున్నారు.
మచిలీపట్నం నుండి విజయవాడకు 40 ఫైబర్ బోట్లు..
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు మచిలీపట్నం 40 ఫైబర్ బోట్లను విజయవాడకు తరలించారు. వరద ఉధృతికి ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను బోట్లను ప్రత్యేక వాహనాల్లో తరలించారు. బోట్లతో పాటు ఆహార పదార్థాలను కూడా తరలించారు. కాగా, మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో గత రెండు రోజులుగా సీఎం చంద్రబాబుతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భారీ వర్షాలు.. 432 రైళ్లు రద్దు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నిన్నటి (ఆదివారం) నుంచి ఇప్పటివరకు 432 రైళ్ల సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 140 రైళ్లను దారి మళ్లించింది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.
560 సర్వీసులు రద్దు చేసిన ఆర్టీసీ
ఎడతెరపిలేని వర్షాలు, వరదలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 560కిపైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోవడంతో భారీ సంఖ్యలో బస్సులను రద్దు చేశారు. ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com