AMARAVATHI: మూడేళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి

AMARAVATHI: మూడేళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి
X
రూ.33,137.90 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు.. పనుల వేగం పెంచుతామన్న మంత్రి

అమరావతి నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. సీఆర్‌డీఏ 42,43 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.33,137.90 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం రాగానే, రాజధాని అమరావతి నిర్మాణాన్ని గాడిలో పెట్టిందని మంత్రి పార్థసారథి తెలిపారు. మాజీ సీఎం జగన్ వల్లే జల్ జీవన్ మిషన్ పథకం నిర్వీర్యం అయిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి రూ. 26, 804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ. 4 వేల కోట్లను మాత్రమే ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు. ప్రజలకు స్వచ్చమైన తాగు నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్‌ పథకాన్ని కేంద్రప్రభుత్వం చేపట్టిందని, ఆ పథకాన్ని కూడా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు.


రూ. 31 వేల కోట్లు సిద్ధం

అమరావతిని అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థతతో ముందుకెళ్లేందుకు సిద్ధమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే మొత్తం 31 వేల కోట్లు రూపాయలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నిధులను ఉపయోగించి రాజధాని నిర్మాణం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. అమరావతికి దేశవ్యాప్తంగా పర్యాటక, వ్యాపార రంగాల్లో కీలకమైన స్థానం ఏర్పడుతుందని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.

అగ్ర నగరంగా అమరావతి..

ప్రస్తుతానికి ఆర్థిక సంబంధిత అనుమతులు, భూముల స్వాధీనం, నిర్మాణ రంగంలోని ఒప్పందాలు మొదలైన వాటిపై పరిశీలన జరుగుతోందన్నారు. అన్ని దిశలలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, ఎటువంటి అంతరాయం లేకుండా పనులు కొనసాగిస్తామని ఆయన అన్నారు. అమరావతిని ఒక సమగ్ర నగరంగా, ఆధునిక వసతులతో కూడిన మల్టీ-డెమెన్షనల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. 31 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన, ఈ నిధుల కోసం ఎలాంటి ఆర్థిక సమస్యలు రావని స్పష్టం చేశారు.

Tags

Next Story