మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు

హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో.. అవినీతికి పాల్పడినట్లు ఆయనపై అభియోగం. విచారణ సమయంలో లక్ష్మీనారాయణ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సీఐడీ తీరుపై మండిపడుతున్నారు లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు. కనీసం నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో వైసీపీ సర్కారు వేధింపుల ఆగడం లేదు. నిన్నటివరకు.. విపక్ష నేతలతో పాటు అధికారుల్ని వేధించిన జగన్ సర్కారు.. ఇప్పుడు రిటైర్డ్ అధికారుల్ని వేధించడం మొదలుపెట్టింది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు చేయడమే దీనికి నిదర్శనం. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న సీఐడీ బృందం.. తనిఖీలు చేయాలంటూ చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే, ఉద్దేశపూర్వకంగా ఇలా వేధించడం తగదని అన్నారు..
లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబు వద్ద పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారుగానూ సేవలు అందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. నాడు ఆయన అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు అభియోగాలు మోపుతోంది CID. దీనిపై విచారించాల్సి ఉందంటూ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి ఆయన నివాసంలో సోదాలు చేపట్టాలంటూ హడావుడి చేశారు. ఇదంతా కావాలనే చేస్తున్నారని, కేసుల పేరుతో వేధిస్తున్నారని లక్ష్మీనారాయణ కుటుంబం తీవ్రంగా మండిపడుతోంది. అసలు తమకు నోటీసులే ఇవ్వకుండా సోదాలకు రావడం ఏంటని ప్రశ్నించారు. దీంతో.. అప్పటికప్పుడు నోటీస్ ఇచ్చారు. కొన్ని పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆడిట్ విషయంలో అక్రమాలు బయటపడ్డాయని, వాటి ఆధారంగానే కేసును సీఐడీకి అప్పగించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నా.. తనకు సంబంధం లేని విషయాల్లో లక్ష్మీనారాయణ పాత్ర ఉన్నట్టు చూపించేందుకే ఇలాంటివి జరుగుతున్నట్టు కనిపిస్తోందని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఉదయం ఇంట్లోకి రావడంతోనే ఏదో జరిపోతోందన్నట్టు తమను భయాందోళనకు గురి చేశారంటున్నారు.
మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు సిన్సియర్ అధికారిగా పేరుంది. పదవీకాలంలో ఏనాడూ ఆయనపై ఆరోపణలు లేవు. విమర్శలూ ఎదుర్కోలేదు.ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారంటూ ఆయన కూడా CID తీరును తప్పుపడుతున్నారు. ఒక సీనియర్ రిటైర్డ్ అధాకారిని ఇంతలా వేధించడం వైసీపీ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదన్నారు PAC ఛైర్మన్ పయ్యావుల కేశవ్. CID తనిఖీల విషయం తెలిసి అక్కడికి వెళ్లిన ఆయన.. రిటైర్డ్ IAS లక్ష్మీనారాయణ ఎంత నిష్పాక్షికంగా సేవలు అందించారో అందరికీ తెలుసన్నారు.
చంద్రబాబు హయాంలో కీలకంగా పనిచేసిన IASలు, IPSలు, IRSలకు వైసీపీ అధికారంలోకి రావడంతోనే వేధింపులు మొదలయ్యాయి. కొందర్ని కావాలనే పక్కకు పెట్టారు. మరికొందర్ని టార్గెట్ చేసి ఏదో నిరూపించాలని ట్రై చేశారు. ఈ వేధింపులపై కొందరు న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించారు. ఇప్పుడు రిటైర్డ్ అధికారులను టార్గెట్ చేయడంపై మండిపడుతున్నాయి విపక్షాలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com