అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కేసీఆర్ కసరత్తు

ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమావేశం కానున్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర నీటిపారుదలకు సంబంధించిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి హాజరవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. నదీజలాల విషయంలో కావాలనే ఏపీ ప్రభుత్వం కయ్యం పెట్టుకుంటోందని ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు ధీటుగా సమాధానం చెప్పాలని సీఎం అన్నారు. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేయాలని కేసీఆర్ అధికారులకు తెలిపారు.
అటు కేంద్రంపైనా సీరియస్‌గా ఉన్నారు సీఎం కేసీఆర్. ఏడేళ్ల అలసత్వాన్ని మండలి సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని అధికారులను ఆదేశించారు. నిజానిజాలను దేశానికి తేటతెల్లం చేయాలన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి నీటిని కేటాయించాలని..ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు సీఎం గుర్తు చేశారు. చట్ట ప్రకారం కొత్త ట్రైబ్యునల్ లేదా ప్రస్తుత ట్రైబ్యునల్ ద్వారా అయినా తెలంగాణకి నీటి కేటాయింపులు జరపాలని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య లేదా నదీ పరీవాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరినట్లు సీఎం వివరించారు. అయితే, ఏడేళ్లు అవుతున్నా ప్రధానికి రాసిన లేఖకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర వైఖరిని కూడా ఎండగట్టాలని అదే సమయంలో తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com