రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగించుకుని.... మూడో విడత పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగించుకుని.... మూడో విడత పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడో దశ ఎన్నికలపై అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 13 జిల్లాల్లోని 20 డివిజన్లలో 160 మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మూడవ విడత ఎన్నికల్లో ఇప్పటికే 579 పంచాయతీలు, 11 వేల 732 వార్డులు ఏకగ్రీవమవ్వగా.... మిగతా 3 వేల 221 పంచాయతీలు, 19 వేల 607 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే సాయంత్రం నాలుగు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పంలో కూడా రేపే ఎన్నికలు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. తన నియోజనర్గంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని... ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నడూలేని విధంగా కుప్పంలోని పంచాయతీల్లో అలజడి రేకెత్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో తెలిపారు. కొన్ని పంచాయతీల్లో భద్రత పటిష్టం చేయాలని... మరికొన్ని మండలాల్లో ప్రత్యేక భద్రత, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండాలని లేఖ ద్వారా ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.

గుంటూరు జిల్లా గురజాల రెవెన్యూ డివిజన్‌లో మూడో విడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని మొత్తం 132 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా... వాటిలో 98 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 34 గ్రామాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ రగడ నేపథ్యంలో అటు రిటర్నింగ్‌ అధికారులు, ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదిలా ఉంటే ఎన్నికల వేళ గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో టీడీపీకి మద్దతిచ్చిన కుటుంబంపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈదర రాఘవేంద్రరావు అతని కుటుంబ సభ్యులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దీంతో క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైసీపీ వర్గీయులే తమపై దాడులు చేశారని రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

విజయనగరం డివిజన్‌లోని 9 మండలాల్లో మూడు విడత పంచాయతీ పోలింగ్‌ జరగనుంది. 3 నియోజకవర్గాల్లో 9 మండలాలోని 248 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. అయితే వీటిలో ఇప్పటికే 37 పంచాయతీలు ఏకగ్రీవం కాగా... మిగిలిన స్థానాలకు పోటీ జరగనుంది. ఇందుకోసం 2 వేల 30 పోలింగ్‌ బూత్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మూడో విడతలో మొత్తం 3 లక్షల 60 వేల 181 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్‌ జరపనున్నారు.

ఇక విజయనగరంలోని మూడో విడత ఎన్నికల్లో 62 సమస్యాత్మక, 46 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు ఎస్పీ రాజకుమారీ తెలిపారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 16 వేల 887 మందిపై ముందస్తు బైండోవర్‌ కేసులు నమోదు చేశామని.... అలాగే జిల్లా వ్యాప్తంగా 15 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణం స్పందించేందుకు 82 రూట్‌ మొబైల్స్‌, 30 స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీమ్‌లతో పాటు 3 వేల పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.

అలాగే శ్రీకాకుళం జిల్లా కూడా మూడో విడత పోలింగ్‌కు సన్నద్ధమైంది. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 9 మండలాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే 293 పంచాయతీలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా... వాటిలో 45 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 248 గ్రామాల్లో పోటీ జరగనుంది. మొత్తం 2 వేల 671 పోలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు సామాగ్రిని తరలించారు.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ థర్డ్‌ ఫేజ్‌ పంచాయతీ పోలింగ్‌కు సర్వం సిద్ధమయ్యాయి. చింతపూడి సర్కిల్‌ పరిధిలో 71 పంచాయతీలకు పోలింగ్‌ జరగాల్సి ఉండగా..... వాటిలో 10 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 61 పంచాయతీల్లో ఎన్నికల కోసం ఏర్పాట్లు జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక మూడో విడత ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం మూడున్నర గంటలతో పోలింగ్‌ ముగిసిన తర్వాత.... సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్‌ జరగనుంది.

Tags

Next Story