Attempt Kidnapping : ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ కు యత్నం
గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ముగ్గురు చిన్నారులను ఓ ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా.. మరో ఆటోడ్రైవర్ అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు మజీద్‌బండలోని ఓ ప్రైవేటు స్కూల్‌కి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూశారు. గుర్తు తెలియని ఓ ఆటోడ్రైవర్ వచ్చి వాళ్లని బలవంతంగా ఆటో ఎక్కించుకున్నాడు. చిన్నారుల్లో ఇద్దరు బాలురు, బాలిక ఉన్నారు. ఆటో మజీద్ బండ శ్మశానవాటిక వైపునకు వెళ్తుండగా.. అనుమానంతో చిన్నారులు డ్రైవర్‌ను ఎవరు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ ప్రశ్నించారు.అటుగా వెళ్తోన్న మరో ఆటోడ్రైవర్ వారిని గమనించి అప్రమత్తమయ్యాడు. ఆటోను అడ్డుకొని డ్రైవర్‌ను సమీపంలోని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించాడు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను కాపాడిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com