CS Shanti Kumari : వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సిఎస్ శాంతి కుమారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న సంఘటనకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్.పి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నేడు సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయ పునరావాస చర్యలను సమీక్షించారు.
డీజిపి జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ , నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్న ఈ టెలీకాన్ఫరెన్స్ లో సి.ఎస్ మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పెద్ద వాగు కు చెందిన మూడు గేట్లు ఎత్తడంతో సమీపంలోని నాలుగు గ్రామాలలోకి వరద నీరు ఒక్క సారిగా చేరడంతో వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28 మందిని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెండు హెలికాప్టర్ల సహాయంతో రక్షించి సురక్షింత ప్రాంతాలకు తరలిచామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మరో 20 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర రెస్క్యూ బృందాలు సహాయ పునరావాస కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాయని అన్నారు. గుమ్మడివెళ్లి, కోయగూడెం, కొత్తూరు, గాజులపల్లి గ్రామాల ప్రజలను పునరావాస శిబిరాల్లోకి తరలించే ప్రక్రియ కొనసాగుతుందని కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుండి ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సి.ఎస్ స్పష్టం చేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలను చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి సి.ఎస్ సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని డీజీపీ జితెందర్ తెలిపారు. భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లు ఎత్తాల్సివచ్చిందని, ప్రస్తుతం వరద తగ్గిందని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరించారు. సిఇ తో పాటు ఇతర సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com