అజారుద్దీన్ ఎఫెక్ట్.. శాఖల్లో మార్పులు తప్పవా..?

అజారుద్దీన్ ఎఫెక్ట్.. శాఖల్లో మార్పులు తప్పవా..?
X

తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ ను తీసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్న సమయంలో అజారుద్దీన్ కు కీలక పదవి ఇవ్వడం అంటే మైనారిటీ ఓట్లను ఆకర్షించడమే అని చర్చ నడుస్తుంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సమయంలో ఇలా చేయడం అంటే ఒక వర్గం ఓట్లను ప్రభావితం చేయడమే అంటున్నాయి. అయితే అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేసి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. కాని ముందే కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆరు నెలల్లోగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రావాలి. లేదంటే అప్పుడు చిక్కులు తప్పవు.

ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ కేబినెట్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రెండోసారి కేబినెట్ విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పించబోతున్నారు. ఇందులో అజారుద్దీన్ కు మాత్రమే బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇంకా ఇద్దరు ఎవరో తేలాల్సి ఉంది. అయితే అజారుద్దీన్ కు ఇప్పుడు ఏ శాఖ కేటాయిస్తారు.. మైనారిటీ వర్గం నుంచి ఒకే ఒక్కడు కేబినెట్ లోకి వస్తున్నాడు కాబట్టి ఆయనకు మైనార్టీ శాఖ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మైనార్టీ శాఖ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉంది. అలాగే అజారుద్దీన్ మాజీ క్రికెటర్ కాబట్టి ఆయనకు స్పోర్ట్స్ శాఖ కూడా ఇస్తారనే ప్రచారం ఉంది. ప్రస్తుతానికి వాకిటి శ్రీహరి వద్ద క్రీడా శాఖ ఉంది. ఈ రెండు శాఖలను తీసి అజారుద్దీన్ కు ఇస్తే.. అప్పుడు పూర్తిగా మంత్రుల శాఖల్లో మార్పులు చేయాల్సిందే.

అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తుతానికి 17 శాఖలు ఉన్నాయి. అత్యంత కీలకమైన హోం శాఖ రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఈ శాఖను మైనార్టీ నేతకు ఇస్తారనే ప్రచారం సెక్రటేరియట్ లో వినిపిస్తుంది. గత బిఆర్ఎస్ పాలనలో మెహమూద్ అలీకి హోం శాఖ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు అజారుద్దీన్ కు హోంశాఖ ఇస్తే క్రీడా శాఖ, మైనార్టీ శాఖలను ముట్టుకోరు. కేవలం హోంశాఖ ఇచ్చి సరి పెడతారు. అలా కాకుండా హోం శాఖను అజారుద్దీన్ కు ఇవ్వకపోతే మాత్రం కచ్చితంగా పూర్తి మంత్రుల శాఖలను మార్చాల్సి వస్తుంది. మరి ఏ శాఖ ఎవరికి వస్తుంది, ఎవరికి తగ్గిస్తారు ఎవరికి పెంచుతారు అనేది ఇప్పుడు మంత్రుల్లో ఆందోళన రేపుతోంది. ఇంకా కొత్తగా ఏ ఇద్దరికీ అవకాశం ఇస్తారనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కేబినెట్ లోకి కొత్తగా వచ్చే ఆ ఇద్దరిని బట్టి కూడా మంత్రుల పదవుల్లో మార్పులు ఉంటాయి.


Tags

Next Story